
YSRCP Strategy and TDP Alliance Local Elections
కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తుందని అందరూ ఊహిస్తున్నదే. అయితే అది ఆ విజయాన్ని ఆస్వాదించలేని పరిస్థితి వైసీపీ కల్పించడం విశేషం.
ఈ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా పద్మవ్యూహమే రచించి అమలుచేసినట్లు చెప్పవచ్చు. 1. క్షేత్రస్థాయిలో జరిగిన అల్లర్లు, ఘర్షణలు, 2. కోర్టులో పిటిషన్లు, 3. జగన్ వరుస ప్రెస్మీట్లు, 4. జనసేనకు అన్యాయం జరిగిపోయిందంటూ రెచ్చగొట్టడం.
ఈ వ్యూహంతో ఈ ఎన్నికలను కేంద్ర ప్రభుత్వంతో సహా యావత్ దేశ ప్రజల దృష్టిలో పడేలా చేయగలిగారు. ఈ అల్లర్లు, కేసులు, పిటిషన్ల గురించి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి లేదా వచ్చేలా చేశారని చెప్పవచ్చు.
ముఖ్యంగా టీడీపీ, జనసేనల ముసుగులో వాటి మధ్య చిచ్చు రగిలించేందుకు సోషల్ మీడియాలో వైసీపీ చేసిన ప్రయత్నాలు కూడా బాగానే ఫలించాయి. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేనల నేతలు, కార్యకర్తల మధ్య ఏర్పడిన విభేదాలు, ఉద్రిక్తతలు ఇందుకు నిదర్శనం.
వాస్తవానికి ఈ ఎన్నికల ప్రక్రియ ఈవిధంగానే జరుగుతుందని జగన్ ముందే చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం లైట్ తీసుకోవడం వలన ఇంత అనర్థం జరిగింది.
నాడు ఎన్నికల హడావుడిలో పడి వివేకా హత్య విషయం పెద్దగా పట్టించుకోకపోవడంతో, గుండెపోటు కాస్తా గొడ్డలి పాటుగా మారింది. సాయంత్రానికల్లా ఆ హత్య కేసుని తన మెడకు చుట్టేశారని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పుకున్నారు.
ఒకవేళ వెంటనే దానిపై దృష్టి సారించి ఉండి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని కానీ పట్టించుకోకపోవడం వలన ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించామని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు.
కనుక నాడు శాసనసభ ఎన్నికల సమయంలో జరిగిన ఇటువంటి పొరపాటే ఇప్పుడూ జరిగిందని చెప్పక తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమర్ధంగా నిర్వహించలేక పోయిందనే అప్రదిష్ట కూటమి ప్రభుత్వం మెడకు చుట్టుకుంది.
వైసీపీ అమలు చేసిన ఈ వ్యూహంతో కూటమి పార్టీలు ముఖ్యంగా.. టీడీపి గెలుచుకున్న సీట్లన్నీ అడ్డుదారిలో గెలుచుకున్నవే అనే అభిప్రాయం కలిగించగలిగింది. ఈ అభిప్రాయం బలపడేందుకు జగన్, వైసీపీ ముఖ్య నేతలు వరుసపెట్టి ప్రెస్మీట్లు నిర్వహించి విరుచుకు పడటం ఖాయం.
ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు చాలా సంతోషించవచ్చు. పండగ చేసుకోవచ్చు. కానీ పార్టీల పరంగా, కూటమి ప్రభుత్వ పరంగా ఈ గెలుపును ఆస్వాదించలేని పరిస్థితి వైసీపీ కల్పించిందని చెప్పక తప్పదు.
కనుక ఇకనైనా గట్టి చర్యలు చేపట్టి తదుపరి ఎన్నికల ప్రక్రియలో, ముఖ్యంగా పోలింగ్ రోజున మళ్ళీ ఇలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత్త పడితే మంచిది.
Sandeepa Dhar brings a breezy burst of charm to this pastel-perfect gallery, slipping into a…
H-1B applicants from India are reporting "ghost" H-1B slots while trying to book appointments. These…