
వడ్డించేవాడు మనోడు అయితే ఎక్కడ కూర్చున్నా విస్తరిలో అన్నీ వచ్చి పడతాయన్నట్లు, ఐదేళ్ళ జగన్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వైసీపి కార్యాలయాలు చకచకా నిర్మించేసుకునేందుకు అనుమతులు, నామ మాత్రపు అద్దెలతో లీజులు మంజూరు చేసేసుకున్నారు.
ప్రభుత్వ ఆస్తులకు ధర్మకర్తగా వ్యవహరించాల్సిన జగన్ ప్రభుత్వమే స్వయంగా ప్రభుత్వ భూములను వైసీపికి కేటాయించేసుకుంది. వైసీపి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతల కబ్జాలు వీటికి అధనం.
జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధానిగా అంగీకరించనప్పటికీ తాడేపల్లి మండలంలోని సీతానగరంలో నీటిపారుదలశాఖకు చెందిన కోట్లు విలువ చేసే రెండు ఎకరాల భూమిని ఆక్రమించేసి దానిలో రాజమహల్ వంటి భవనాన్ని కట్టించుకున్నారు.
మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామనే ధీమాతో అక్కడే మరో 15 ఎకరాలు రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. కానీ అధికారం కోల్పోవడంతో ఈ బండారం బయటపడింది. సీఆర్డీఏ అధికారులు వైసీపికి నోటీసులు జారీ చేసి, శనివారం ఉదయం నుంచి ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేయడం ప్రారంభించారు.
దీంతో చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వైసీపికి మంచి అవకాశం లభించింది. ఇంతకాలం ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలన ప్రారంభించారనే అపకీర్తి వైసీపికి మాయని మచ్చగా మిగిలిపోయింది.
కానీ ‘అశ్వథామ హతః కుంజరహ’ అన్నట్లు తాము చేసిన ఈ భూకబ్జాలు, అక్రమాల భాగోతాలను దాచిపెట్టి తమపై చంద్రబాబు నాయుడు అప్పుడే రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారంటూ, చంద్రబాబు నాయుడు కూడా విధ్వంస పాలన ప్రారంభించారని దుష్ప్రచారం మొదలుపెట్టింది.
కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇటువంటి అవినీతి పనులను దాచాలనుకున్నా దాయలేమనే సంగతి వైసీపికి కూడా తెలుసు. కనుక దొంగే దొంగ దొంగ అని అరుస్తూ అందరి దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేసిన్నట్లు వైసీపి కూడా ఇటువంటి విమర్శలతో చంద్రబాబు నాయుడుపై బురద జల్లుతోందని అర్దమవుతూనే ఉంది.
విశాఖ రాజధాని పేరుతో అక్కడ కూడా వైసీపి నేతలు బాగానే భూకబ్జాలు చేశారు. తాము కబ్జాలు చేయడంతో పాటు నగరంలో ఖరీదైన ఎండాడలో వైసీపి కార్యాలయం కోసం రెండు ఎకరాలు కేటాయించేసుకుని అక్కడ కూడా విలాసవంతమైన భవనం నిర్మించేసుకున్నారు.
విశాఖలో చిన గదిలి మండలం ఎండాడ చాలా అభివృధ్ది చెందింది. అక్కడ అపార్టుమెంట్లలో ఒక్కో ఫ్లాట్ విలువే కోటి-కోటిన్నర రూపాయలు ఉంది.
అక్కడ సుమారు రూ.120 కోట్లు విలువైన 2 ఎకరాలలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే వైసీపి కార్యాలయం నిర్మించేసుకుంది. ముందే చెప్పుకున్నట్లు వడ్డించేవాడు మనోడే గాబట్టి ఆ భూమిని ఏడాదికి కేవలం రూ.1,000 అద్దెతో 33 ఏళ్ళకు వైసీపికి లీజుకు ఇప్పించేశారు. ప్రభుత్వం మారడంతో ఈ భాగోతం కూడా బయటపడింది.
నిన్న శాసనసభలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారాలు చేస్తున్న సమయంలోనే ఆఘమేఘాల మీద దాని అనుమతుల కోసం వైసీపి నేతలు రూ.14 లక్షలు జీవీఎంసీకి చెల్లించడం, వెంటనే జీవీఎంసీలో వైసీపి వీరవిధేయ అధికారులు ఆ ఫైలుని శరవేగంగా ఆమోద ముద్రలు వేసేస్తూ అనుమతి మంజూరు చేసేందుకు సిద్దమయ్యారు. కానీ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పిర్యాదుతో ఆ ఫైలు కదలికలకు బ్రేక్ పడింది.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్నిచోట్ల ఎన్ని వందల ఎకరాలను వైసీపికి కేటాయించేసుకున్నారో లెక్కలు తీయవలసి ఉంది. కనుక జగన్ భాషలో చెప్పాలంటే ఇది ‘వైసీపి ఫస్ట్ గ్లిమ్స్’ మాత్రమే. ఇంకా టీజర్ ట్రైలర్, ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ వంటివి చాలానే ఉన్నాయి.
Vijay Deverakonda is confident about his comeback with Ranabaali and has a strong message for…
YS Jagan has been very successful when it comes to mitigating the legal and judicial…