‘బాహుబలి 2’ విడుదలైన తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా “స్పైడర్” కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ‘బాహుబలి’ అమోఘ విజయం తర్వాత ‘శ్రీమంతుడు’ సూపర్ సక్సెస్ అందుకోవడంతో, అదే సెంటిమెంట్ ను ‘బాహుబలి 2’ తర్వాత ‘స్పైడర్’ కొనసాగిస్తుందేమోనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే జూన్ 23వ తేదీ నుండి వాయిదా పడిన ఈ సినిమా రిలీజ్ డేట్ లో స్పష్టత రావాల్సి ఉంది.
ఆగష్టు 11వ తేదీ అని కొందరు, కాదు కాదు ఆగష్టు 25 అని మరికొందరు ఇలా రకరకాలుగా సాగుతున్న ప్రచారం ఎప్పటికీ తెరపడనుందో గానీ, దర్శకుడు మురుగదాస్ కూడా జక్కన్న రూట్ లోనే తీసుకువెళ్తున్నారన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ‘బాహుబలి 2’ మొత్తం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా “స్పైడర్”ను ఈ నాలుగు భాషలలో విడుదల చేయాలని నిర్ణయించారట.
ముందుగా అనుకున్న ప్రకారం, తెలుగు, తమిళ భాషల్లోనే ‘స్పైడర్’ విడుదల కావాల్సి ఉండగా, తాజాగా ‘బాహుబలి 2’ సక్సెస్ తర్వాత, వాటికి తోడూ హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇది కూడా చిత్రం ఆలస్యానికి ఓ కారణం అవుతోందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే నాలుగు భాషలలో ఒకేసారి విడుదలపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ జరగలేదు.


