ఓ కేసు విచారణ ముందుకు సాగనీయకుండా కట్టడి చేయగలిగితే చాలు ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఎన్నటికీ శిక్షపడకుండా తప్పించుకోవచ్చని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్టులను చూస్తే అర్దమవుతుంది.
సాధారణంగా ఎటువంటి కేసులలోనైనా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ అధికారులు దర్యాప్తు చేస్తుంటారు. కానీ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే బాధితులు, విచారణాధికారుల మీద కేసులు వేస్తుండటం విశేషం.
ఇంతకీ విషయం ఏమిటంటే, వివేకా హత్య కేసులో బాధితులు ఆయన కుమార్తె సునీతారెడ్డి, భర్త రాజశేఖ రెడ్డి, ఇదివరకు ఈ కేసు విచారణ జరిపిన సీబీఐ అధికారి ఎస్పీ రాంసింగ్ ముగ్గురిపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 156 (3) కింద శనివారం కేసు నమోదయ్యింది.
వారు ముగ్గురూ తనను బెదిరించారని, వైసీపిలో కొందరు ప్రముఖులకు ఈ హత్యతో సంబంధం ఉందని చెప్పాలని తనపై ఒత్తిడి చేశారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. తాను అప్పుడే ఎస్పీ అంభురాజన్‌ని కలిసి ఫిర్యాదు చేశానని పిటిషన్‌లో పేర్కొన్నారు.
వారి ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందని కనుక పోలీసులతో రక్షణ కల్పించాలని కూడా కోరానని, కానీ ఎస్పీ తన పిర్యాదుని పట్టించుకోకపోవడంతో కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చిందని కృష్ణారెడ్డి కోర్టుకి తెలియజేశారు. ఈ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తనపై ఒత్తిడి చేసినందుకు సునీతారెడ్డి, రాజశేఖ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ ముగ్గురిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. న్యాయస్థానం ఆదేశం మేరకు పులివెందుల పోలీసులు వారు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
అంటే వివేకా హత్య కేసు కంటే ముందు ఇటువంటి పెటీ కేసుల విచారణ తప్పదన్న మాట! ఒకవేళ ఈ కేసుని ఉన్నత న్యాయస్థానాలు కొట్టేసినా వెంటనే మరో కేసు వేయకుండా ఉండరు. అంటే వివేకా హత్య కేసు విచారణ ముందుకు కదలకుండా ఈవిదంగా పెటీ కేసులతో కట్టడి చేస్తున్నట్లు అర్దమవుతోంది.
వివేకా హత్యకేసుని ప్రభావితం చేస్తారనే వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రితో సహా పలువురికి న్యాయస్థానం బెయిల్ నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కోర్టుల చేతే ఈ కేసు విచారణ ముందుకు కదలకుండా ప్రభావితం చేయవచ్చని ఇది నిరూపిస్తోంది.
న్యాయవిద్యలో నేర్పించని అనేక కొత్త విషయాలను న్యాయవాదులందరికీ ఈ ఒక్క కేసు నేర్పిస్తోందని చెప్పవచ్చు. బహుశః న్యాయచరిత్రలో ఇది ఓ కొత్త ట్రెండ్, కొత్త అధ్యాయంగా నిలుస్తూ, దేశంలో ఇతర రాష్ట్రాలలో తీవ్ర నేరాలలో ఆరోపణలు ఎదురుకొంటున్న వారందరికీ కూడా ఈ కేసు మంచి స్ఫూర్తినిస్తుందేమో?
—




