దక్షిణాది భాషా సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన నటి ప్రేమ విడాకులు కోరుతూ బెంగుళూరులోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు పెట్టుకుంది. 2006లో ఇండస్ట్రియలిస్ట్ జీవన అప్పచ్చుతో ప్రేమ పెళ్ళి జరిగిన తర్వాత సినీ పరిశ్రమకు దూరమైన ప్రేమ హఠాత్తుగా బుధవారం నాడు బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో ప్రత్యక్షమైంది. భర్తతో విభేదాలు రావడంతో విడివిడిగా నివసిస్తున్న ఇరువురు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు.
39 ఏళ్ళ ప్రేమ కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. 2009లో చివరిసారిగా ‘శిశిర’ అనే చిత్రంలో కనిపించిన ప్రేమ కన్నడలో 75, తెలుగులో 30కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. తెలుగులో ధర్మచక్రం, జగదేకవీరుడు, అదిరిందిగురూ, కోరుకున్న ప్రియుడు, చెలికాడు, దేవి, దీర్ఘసుమంగళీభవ వంటి చిత్రాలు ప్రేమకు ప్రేక్షకుల్లో గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే, ఆమె వైవాహిక జీవితానికి ఇలాంటి ‘కార్డు’ పాడడం బాధాకరమని కుటుంబ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



