హీరోయిన్, యాంకర్లుపై అభ్యంతరకర మాటలకు కమెడియన్ అలీ కేరాఫ్ అడ్రస్. అయితే ఈ ముద్ర పడిన తర్వాత నుండి కాస్త కంట్రోల్ గా మాట్లాడుతున్న అలీ, “తిక్క” సినిమా పోస్టర్ మరియు మోషన్ పిక్చర్ విడుదల సందర్భంగా పలికిన మాటలు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పొట్టచక్కలయ్యేలా చేసాయి. “ఈ హీరో మెగాస్టార్ మేనల్లుడు, పవర్ స్టార్ గారి మేనల్లుడు… వారిద్దరికి ఎంత తిక్క ఉందో మనకు తెలుసు… వారిద్దరి తిక్క పంచుకుని ఈ రెండక్షరాల ‘తిక్క’ సినిమాలో నటించారు” అంటూ సాయి ధరమ్ తేజ్ కు ఇంట్రడక్షన్ ఇచ్చారు అలీ.
మలేషియాకు తీసుకెళ్ళి షూటింగ్ చేసారని, మొదటి రోజు చాలా ఉత్సాహంగా ఉన్న యూనిట్ సభ్యులు, మూడు, నాలుగు రోజు వచ్చే సరికి… అ… ఏంటి నా షాట్ అంటూ నీరసంగా మారిపోయారని, అయితే తండ్రి – తల్లి వంటి నిర్మాత – దర్శకుడు ఎవరినీ కష్టపెట్టకుండా బిడ్డలు మాదిరి చూసుకున్నారని, నాలుగవ రోజు నుండి మీ షాట్ లేదండి మీరు రూమ్ కు వెళ్లిపోవచ్చు అని చెప్పగానే… కట్ డ్రాయర్ల మీద పరిగెత్తారని, హీరోయిన్లు కూడా బాగా సహకరించారని చెప్పడంతో ఒక్కసారిగా మళ్ళీ నవ్వులు కురిసాయి.
దీంతో ఇది గమనించిన అలీ, “నేనేం మాట్లాడినా బూతు అయిపోతోంది బాబోయ్…” ఎందుకొచ్చింది నాకు… అంటూ ఆ అంశాన్ని పక్కన పెట్టారు. ఈ సినిమాలో అందరూ అద్భుతమైన క్యారెక్టర్లు చేసారని, అలాగే లంత్రాపగడిస్ అంటూ హీరోయిన్లను సంభోదిస్తూ ప్రసంగాన్ని ముగించారు అలీ. ఈ కమెడియన్ మైక్ చేతిలో ఉన్నంతసేపు హీరో సాయి ధరమ్ తేజ్ పక్కనే ఉన్న దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి నవ్వుతూనే ఉన్నాడు.



