ఏపీ పాఠశాల విద్యాశాఖ గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి మొత్తం 2,721 పోస్టులు భర్తీ చేయబోతోంది.
వీటిలో జనరల్ పాఠశాలలు: ఎస్ఏ, ఎస్‌జీటీ: 2,111 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్: ఎస్ఏ, ఎస్‌జీటీ పోస్టులు: 350, సొసైటీలు వగైరా: ప్రిన్సిపల్స్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ: 260 పోస్టులు భర్తీ చేయబోతోంది.
ఈ నెల 11వ తేదీ నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 5వ తేదీన మాక్ టెస్ట్ నిర్వహిస్తారు. డిసెంబర్ 14 నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 20 నుంచి జనవరి 13లోగా పరీక్షలు పూర్తవుతాయి.
జనవరి 15న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. దానిపై అభ్యంతరాలు స్వీకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత జనవరి మూడో వారంలో తుది కీ విడుదల చేస్తారు.
ఈ పరీక్షలను సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు సాధారణ రిజర్వేషన్స్, అలాగే స్పోర్ట్స్ కోటా కూడా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వార్త ఇప్పటికే చూశాము కదా? దీని గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏముంది? అనే సందేహం కలగవచ్చు. కొత్తగా ఏమీ లేదు కానీ పాత కబుర్లు చాలానే ఉన్నాయి.
మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి “ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండూ ఒకటే కదా?” అని అన్నప్పటి నుంచి గూగుల్‌పై ఒత్తిడి పెరిగింది. రెండూ వేర్వేరని గూగుల్ తేల్చి చెప్తే గానీ దాన్ని విడిచిపెట్టలేదు.
అయినప్పటికీ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయిన ప్రతీసారి ఈ ధర్మ సందేహం కలిగేలా చేశారు. కనుక ఇది డీఎస్సీయే తప్ప ఏపీపీఎస్సీ కాదని గుర్తు చేయక తప్పదు.
ఇక మెగా డీఎస్సీతో 16,000కు పైగా పోస్టులు భర్తీ చేసి ఆ క్రెడిట్ కొట్టేద్దామని పాపం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశ పడ్డారు. కానీ ఆయనకు ఆ ఆశ, సంతోషం, క్రెడిట్ దక్కనీయలేదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.
డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఆ తర్వాత సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ శ్రేణులతో చాలా హడావిడి చేయించారు.
దీనినే మరోవిధంగా చెప్పాలంటే ఈ ఆందోళనలతో మంత్రి నారా లోకేష్ చేతిలో ఉన్న డీఎస్సీ క్రెడిట్‌ని జగన్ హైజాక్ చేసి ఎత్తుకుపోయారని చెప్పవచ్చు.
దాంతో డీఎస్సీ క్రెడిట్ దక్కడం సంగతి దేవుడెరుగు.. అవకతవకలు జరగలేదని సంజాయిషీలు ఇచ్చుకోవాల్సి వచ్చింది కూడా.
కనుక ‘డీఎస్సీ నోటిఫికేషన్’ అంటే కేవలం ఉద్యోగాల భర్తీ మాత్రమే కాదు. ఏపీపీఎస్సీయా-డీఎస్సీయా అనే అనుమానం మొదలు కోర్టు కేసులు, వైసీపీ ఆందోళనలు కూడా ఇమిడి ఉంటాయని గ్రహించాలి.
మెగా డీఎస్సీతో పోలిస్తే దీనిలో పావు వంతు కూడా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కనుక దీనికి వైసీపీ ఆందోళనలు కూడా అదే నిష్పత్తిలో ఉంటాయేమో?
కానీ సీబీఐ విచారణకు, మంత్రి నారా లోకేష్ రాజీనామాకు పట్టుబట్టిన వైసీపీ, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ‘ఎన్నికలు-అక్రమాలు’ అనే కొత్త సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడుతోంది. కనుక మెగా డీఎస్సీపై హడావుడి కేవలం రాజకీయ కాలక్షేపం కోసమేనా?





