నేడు తిరుపతి జిల్లా చంద్రగిరిలో అనూహ్య సంఘటన జరిగింది. పరిషత్ ఎన్నికల్లో దాదాగిరి చేద్దామని వచ్చిన మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మాజీ టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధా రెడ్డి ఆయన నోట మాట రాకుండా అడుగు కదలనీయకుండా కట్టడి చేశారు.
ఆయన ఎదుటే “మీడియాలో వస్తుందని పాపం భయపడి మాట్లాడకుండా తప్పించుకునేందుకు గంట నుంచి ఆ ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు. పాపం నిలబడి.. నిలబడి కాళ్ళు పీకుతున్నాయేమో… ఆయనకు ఓ కుర్చీ వేయండి… నాక్కూడా ఓ కుర్చీ వేయండి… ఇద్దరికీ టీలు పంపించండి.. ఇద్దరం ఇక్కడే కూర్చొని టీ తాగుతూ పోలింగ్ ఎలా జరుగుతుందో చూస్తాం,” అని సుధా రెడ్డి అంటుంటే కన్నీళ్ళు ఒక్కటే తక్కువనిపిస్తుంది. అంతగా ఆమె ర్యాగింగ్ చేశారు.
కానీ ఆయన గురించి ఒక్క ముక్క కూడా తప్పుగా మాట్లాడలేదు. పైగా చుట్టూ కెమెరాలతో మీడియా ప్రతినిధులు, పోలీసులు ఉన్నారు. కనుక చెవిరెడ్డి ఫోన్ వదలలేదు… ఆయన నోట్లో నుంచి ఒక్క మాట రాలేదు!
ఆయన ఫోన్ పట్టుకుని ఎవరితోనో మాట్లాడుతున్నట్లు నటిస్తుండగానే ఆమె పోలీసులను ఉద్దేశించి, “ఓటర్లను వరుసగా పంపించండి. ఎవరి ఓట్లు వారిని వేసుకోనీయండి,” అని అన్నారు.
అంతకు ముందు “పోలింగ్ ప్రశాంతంగా జరగాలని మీరూ కోరుకుంటున్నారు… మేమూ కోరుకుంటున్నాము. కనుక ఇవాళ్ళ మీరు నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్తే అక్కడికి నేనూ వస్తాను. కావాలంటే ఇద్దరం కలిసి నా కారులోనే అన్ని పోలింగ్ బూత్‌లకు వెళ్దాం,” అని చెప్పినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెల్లగా అక్కడి నుంచి జారుకుని తన కారులో వేరే బూత్‌కు బయలుదేరారు.
వెంటనే సుధారెడ్డి కూడా తన కారులో ఆయనను ఫాలో చేస్తూ పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. అక్కడే ఆమె ఆయనను ఈవిధంగా ర్యాగింగ్ చేశారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి అందరూ నవ్వుకుంటున్నారు. మరి అది చూసిన వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, రోజా, వారి అధినేత జగన్ ఏమనుకుంటున్నారో?





