
అల్లు అర్జున్ పుష్ప-2తో సినీ రికార్డులు బద్దలు కొడుతుంటే, కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కంచుకోటని బద్దలుకొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
అల్లు అర్జున్ సినీ పరిశ్రమలో, కేటీఆర్ రాజకీయాలలో దూసుకుపోతున్నారు. అలాగే ఇద్దరి కేసులు కూడా పోటాపోటీగా సాగుతుండటం యాదృచ్ఛికమే.. విచిత్రమే.
ఇద్దరి కేసులు సమాంతరంగా సాగుతున్నందున, ఈ కేసుల్లో కీలక పరిణామాలు కూడా ఇంచుమించు కూడా ఒకేసారి జరిగే అవకాశాలు ఎక్కువ.
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కేసు, సంధ్య థియేటర్ కేసులో చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన కేసుపై నేడు నాంపల్లి కోర్టు విచారణ జరిపి డిసెంబర్ 30 కి వాయిదా వేసింది.
ఫార్ములా 1 రేసింగ్ కేసుని కొట్టేయమని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపి ఈ నెల 31కి వాయిదా వేసింది.
కనుక ఈ నెల 30 వరకు అల్లు అర్జున్, 31 వరకు కేటీఆర్ జోలికి పోలీసులు వెళ్ళబోరు.
అయితే ఈ రెండు కేసులలో ఎవరు చిక్కుకుంటారు?ఎవరు బయటపడతారు?అని ఆలోచిస్తే అల్లు అర్జున్ బయటపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.
నిన్న సిఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీలో అల్లు అర్జున్ వ్యవహార శైలి, కేసు గురించి చర్చించలేదని సినీ ప్రముఖులు చెప్పుకుంటున్నప్పటికీ, ఆయన కారణంగానే ఈ అత్యసర సమావేశమైనప్పుడు ఆయన కేసు గురించి చర్చించలేదంటే నమ్మశక్యంగా లేదు.
కానీ సమావేశం తర్వాత ఈ కేసు గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు. కనుక ఏదో రాజీ కుదిరే ఉండవచ్చు.
కానీ ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది గనుక పోలీసులు చట్ట ప్రకారం చేయాల్సినవి చేస్తుంటే, న్యాయవాదులు చట్ట ప్రకారమే ఈ కేసును హ్యాండిల్ చేసి అల్లు అర్జున్‌ని ఈ కేసు నుంచి బయటపడేయగలరు. కనుక ఈ కేసు ఎప్పటిలోగా ముగుస్తుందనేది మాత్రమే తెలియాల్సి ఉంది.
ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారంలో ఎటువంటి అవినీతి జరగలేదని కేటీఆర్ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. అవినీతి జరిగిందని ఏసీబీ కూడా చెప్పడం లేదు. ఫెమా, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించి కేటీఆర్ అక్రమంగా విదేశీ సంస్థకు బ్రిటన్ పౌండ్ల రూపంలో రూ.53 కోట్లు బదిలీ చేశారని, ఇది ఆర్ధిక నేరమని ఏసీబీ న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈడీ కూడా దీనిని ఆర్ధికనేరంగానే పరిగణిస్తోంది కనుకనే జోక్యం చేసుకొని కేటీఆర్ మీద వేరేగా కేసు నమోదు చేసింది.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ ప్రశాంత్ వర్మ కేంద్రం అనుమతి తీసుకోకుండానే కేటీఆర్‌పై కేసు నమోదుకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుమతించారని అనుకోలేము. కనుక ఈ కేసులో న్యాయ, చట్టపరమైన అంశాలే కాక రాజకీయంగా కూడా కొన్ని చిక్కుముడులు ఉన్నాయని స్పష్టం అవుతోంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ జోక్యం ఇదే సూచిస్తోంది. అంటే కేటీఆర్ అరెస్ట్‌కి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనుకోవచ్చు. అందుకే కాంగ్రెస్, బీజేపిలు కత్తులు దూసుకుంటున్నప్పటికీ అవి పరస్పరం సహకరించుకుంటున్నాయని కేటీఆర్, హరీష్ రావు తదితరులు పదేపదే ఆరోపిస్తున్నారని అనుకోవచ్చు.
ఎఫ్1 కేసు వెనుక ఈ ఫ్లాష్ బ్యాక్ గమనిస్తే కేటీఆర్ అరెస్ట్ తప్పదని స్పష్టమవుతోంది. తన అరెస్ట్ గురించి మాట్లాడుతూ “అరెస్ట్ చేస్తే ఏమవుతుంది?మహా అయితే ఓ రెండు నెలలు జైల్లో ఉండి యోగా వగైరా చేసుకొని ఫిట్‌గా తయారయ్యి బయటకు వస్తాను. అంతే!” అన్నారు. కనుక యోగా చేసుకునేందుకు కేటీఆర్ సిద్దం కాక తప్పదు.
కానీ ఈ కేసులో ఈడీ కూడా చేరింది. కనుక రెండు నెలలకు బదులు ఆరేడు నెలలు జైల్లో యోగా చేసుకోవలసి రావచ్చు!
ఆలోగా లేదా ఆ తర్వాత ఎలాగూ బెయిల్‌పై బయటకు వచ్చేసి “న్యాయం ధర్మం గెలిచ్చిందని” చెప్పుకునే వెసులుబాటు కేటీఆర్‌కి ఉండనే ఉంటుంది.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…