ఒకప్పుడు తెలుగు సినిమా రీమేక్ రాజాగా విక్టరీ వెంకటేష్ పేరు ప్రముఖంగా వినపడేది. ఆ తర్వాత ఈ స్థానం కోసం మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ కష్టపడ్డారు, అనుకున్నది సాధించారు కూడా! ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోలలో ఎక్కువ రీమేక్ సినిమాలలో నటించిన ఘనత పవన్ సొంతం. బహుశా పవన్ స్ఫూర్తి పొందారో ఏమో గానీ చిరంజీవి నుండి అల్లు అర్జున్ వరకు మెగా హీరోలందరూ ప్రస్తుతం ‘రీమేక్’ల వైపుకు మొగ్గు చూపుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి “కత్తి” రీమేక్ ప్రకటన గురించి తెలిసిందే. అలాగే మెగా తనయుడు రామ్ చరణ్ ఇటీవలే ‘తని ఒరువన్’ సినిమా రీమేక్ ను అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తాజాగా ఇదే బాటలో అల్లు అర్జున్ కూడా చేరబోతున్నారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. తమిళ సినిమా ‘కనితన్’ రీమేక్ లో బన్నీ నటించబోతున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాలలో హల్చల్ చేస్తోంది. అధికారిక ప్రకటన అయితే రాలేదు గానీ, అల్లు అర్జున్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.
అదే నిజమైతే… టాప్ స్టార్లుగా కొనసాగుతున్న మెగా హీరోలంతా ఒకేసారి రీమేక్ చిత్రాల బాట పట్టిన ఘనతను సొంతం చేసుకుంటారు. ఎందుకంటే…. పవన్ జాబితాలో కూడా ఒక రెండు రీమేక్ చిత్రాల పేర్లు ఉన్నాయి. ఈ ఒరవడి చూసి… టాలీవుడ్ లో ఈ మెగా హీరోలకేమైంది..? ఒక వైపు ‘క్షణం’ వంటి కొత్త కధలను ఆదరిస్తున్న సినీ ప్రేక్షకులకు చూసిన సినిమానే చూపించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.



