
పుష్ప సినిమాలో పుష్పరాజ్‌ని పట్టుకోబోయి బన్వర్ సింగ్ షెకావత్ అవమానపడిన్నట్లు, అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించి సిఎం రేవంత్ రెడ్డి ఎదురుదెబ్బ తిన్నారా?అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది.
పుష్ప-2 ఏవిదంగా యావత్ దేశప్రజలను ఆకర్షించిందో, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం కూడా అంతే సమానంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దేశవిదేశాలలో అందరూ దీని గురించి చర్చించుకునేలా చేసింది.
అల్లు అర్జున్‌కి సంఘీభావం తెలిపేందుకు యావత్ టాలీవుడ్ కదిలివచ్చింది. తద్వారా అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి తప్పు చేశారని టాలీవుడ్ చెప్పిన్నట్లే భావించవచ్చు.
“అందరూ అల్లు అర్జున్‌ని ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయించిందనే అడుగుతున్నారు తప్ప సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో చనిపోయిన మహిళ, ఇంకా వెంటీలేటర్ మీద మృత్యువుతో పోరాడుతున్న ఆమె కుమారుడు గురించి ఎవరూ మాట్లాడరేమి?ఆమెకు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని ఎవరూ అడగరేమి?” అనే కాంగ్రెస్ నేతల వాదనలను ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వంటి కాంగ్రెస్ నేతలు పలువురు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. అంటే రేవంత్ రెడ్డి తప్పు చేశారని చెపుతున్నట్లే కదా?
సొంత పార్టీ వల్లే తప్పు పడుతుంటే ప్రతిపక్షాలు తప్పు పట్టకుండా ఉంటాయా? బీజేపి, బిఆర్ఎస్ పార్టీలు కూడా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డాయి.
అల్లు అర్జున్ పట్ల సామాన్య ప్రజలు కూడా సానుభూతి చూపుతున్నారు. “రేవతి మృతి పట్ల అల్లు అర్జున్ సంతాపం తెలిపి, ఆమె కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్ధిక సాయం, ఆ బాలుడి చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని చెప్పారు కదా?
వారికి ఎప్పుడు ఎటువంటి సాయం అవసరమైన తాను చేస్తానని, వారి కుటుంబానికి అండగా ఉంటానని అల్లు అర్జున్ చెప్పారు కదా? రేవతి భర్త సైతం అల్లు అర్జున్ తప్పేమీ లేదని, ఆయనపై కేసు ఉపసంహరించుకుంటానని చెపుతున్నారు కదా?” అని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు.
మరో విషయం ఏమిటంటే, అల్లు అర్జున్ దోషి అని ప్రభుత్వం కోర్టులో నిరూపించగలగాలి. కానీ ప్రభుత్వానికి అంత పట్టుదల, చిత్తశుద్ధి ఉన్నాయా?అంటే అనుమానమే. మరి అటువంటప్పుడు అల్లు అర్జున్‌ని ఎందుకు అరెస్ట్ చేయించారు?ఆయన అరెస్ట్ వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి?అని మీడియా, ప్రజల ప్రశ్నలకు రేవంత్ ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక తడబడుతున్నారు. అల్లు అర్జున్ పట్ల తమ ప్రభుత్వానికి ద్వేషం లేదని మంత్రి సీతక్క వంటివారు సర్ధి చెప్పుకొంటున్నారు.
ఇప్పటికే హైడ్రా కూల్చివేతలతో రేవంత్ రెడ్డి పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అది మరింత పెరుగుతుంది. కేసీఆర్‌ని కాదని రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెడితే పాలన, అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ఈవిదంగా దుందుడుకుగా వ్యవహరిస్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
కనుక అల్లు అర్జున్‌ని ఏ ఉద్దేశ్యంతో అరెస్ట్ చేయించినప్పటికీ అంతిమంగా రేవంత్ రెడ్డి అందరి దృష్టిలో దోషిగా మిగిలిపోగా, జైలుకి వెళ్ళి వచ్చిన అల్లు అర్జున్ మళ్ళీ హీరోగా నిలవడమనే ఈ క్లైమాక్స్ ఎవరూ ఊహించలేనిదే కదా?
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…