
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి అని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందునే తీర్మానం చేసి పంపిస్తున్నారు కనుక ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదముద్ర పడటం ఖాయమే అనుకోవచ్చు.
సాక్షాత్ ప్రధాని మోడీ స్వయంగా భూమిపూజ చేసిన అమరావతినే జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా పక్కన పడేశారు. కనుక భవిష్యత్‌లో మళ్ళీ అలాంటి ఆటంకాలు కలుగకుండా నివారించేందుకు అమరావతికి ఈ రాజముద్ర చాలా అవసరమే.
అయితే నిన్న శాసనసభలో డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌తో సహా మాట్లాడిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ‘మళ్ళీ జగన్ రాడు’ అని నొక్కి చెపుతూనే, ‘ఒకవేళ వస్తే’ అంటూ మాట్లాడారు.
జగన్ శాసనసభకు, జనం మధ్యకు రాకపోయినా వారిలో ఈ భయం లేదా ఆలోచన కలిగించగలిగారని చెప్పక తప్పదు. అందుకే అంబటి రాంబాబు అప్పుడే ‘అర్దమయిపోయిందా?’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు కూడా.
డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “సెంటు భూమిచ్చిన రైతు మొదలు లక్ష కోట్లు పెట్టుబడి పెడుతున్న మిట్టల్ వరకు మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏమిటనే ఆలోచిస్తున్నారు. వీళ్ళు మళ్ళీ వస్తే అమరావతిని ఏం చేస్తారనే భయం అందరిలో ఉంది. కానీ వాళ్ళు రారు.. ఏం చేయలేరు,” అని అన్నారు.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, “ఈ తీర్మానానికి పార్లమెంట్ చేత ఆమోదముద్ర పడిన తర్వాత భవిష్యత్‌లో ఏ పిచ్చి తుగ్లక్ పొరపాటున అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చలేరు,” అని అన్నారు.
మంత్రి అచ్చంనాయుడు మాట్లాడుతూ, “2019లో ప్రజలు జగన్‌ని ఎన్నుకొని తప్పు చేశారు. అప్పుడే మళ్ళీ టీడీపిని ఎన్నుకొని ఉండి ఉంటే నేడు ఇలా అమరావతి రాజధాని అంటూ తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా? భవిష్యత్‌లో మళ్ళీ ఇలాంటి సమస్య రాకూడదనే నేడు ఈ తీర్మానం చేస్తున్నాము,” అని అన్నారు.
కనుక భవిష్యత్‌లో అమరావతికి ఆటంకం ఎవరి వల్ల అంటే జగన్ వల్లనే అని స్పష్టమవుతోంది. కానీ మళ్ళీ మేమే ఎన్నికలలో గెలిచి తప్పకుండా అధికారంలోకి వస్తామని గట్టి నమ్మకంతో ఉన్నప్పుడు ఈ తీర్మానం దేనికి? అంటే “ఒకవేళ జగన్ మళ్ళీ వస్తే?” అనే భయం లేదా ఆలోచన వల్లనే కదా?
లోపల మంత్రులు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడే మాజీ మంత్రి పేర్ని నాని బయట మీడియాతోమాట్లాడుతూ, “మీరు 23 నుంచి 164కి రాగలిగినప్పుడు మేము 11 నుంచి 170కి రాలేమా? తప్పకుండా వస్తాం. 170 ఏమిటి 173కి కూడా వస్తాం,” అని అన్నారు. కూటమిలో ‘జగన్ భయానికి’ కారణం ఈ ధీమాయే. ఈ భయానికి మరో బలమైన కారణం కూడా ఉంది.
విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు శక్తివంచన లేకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. అమరావతితో సహా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ 2019 ఎన్నికలలో ప్రజలు ఆయనని వద్దనుకున్నారు.
మళ్ళీ ఇప్పుడూ చంద్రబాబు నాయుడు మరింత వేగంగా, మరింత ఎక్కువగా రాష్ట్రాభివృద్ధి చేస్తున్నారు. కానీ 2029లో ప్రజలు మళ్ళీ మరోసారి ప్రయోగం చేయరనే నమ్మకం ఏమిటి? అలా చేస్తే రాష్ట్రానికి ‘గ్రోత్ ఇంజన్’గా ఉండబోయే అమరావతికి జగన్ వలన నష్టం కలగకూడదనే ఆలోచనతోనే చట్టబద్దత కల్పిస్తున్నారు. కనుక చంద్రబాబు నాయుడు చేయగలిగింది చేస్తున్నారు. అమరావతి కావాలో జగన్ కావాలో తేల్చుకోవాల్సింది ప్రజలే!
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…