
ఇలా జరుగుతుందని అనుకోలేదు… అప్పటికీ పొత్తులు వద్దని నేను మొత్తుకుంటున్నా వాళ్ళు వినలేదు. ఆ పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడుకి షేక్ హ్యాండ్ ఇచ్చేశాడు. వాళ్ళిద్దరూ చేతులు కలపడానికి నేనే కారణమా? అని అప్పుడు నాక్కూడా సందేహం కలిగింది.
సరే! జరిగిందేదో జరిగింది. అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాము. కనుక ధైర్యంగా 175వ నంబర్ బస్సెక్కి బయలుదేరిపోయాము. కానీ బస్సు దిగినప్పుడు చూస్తే కండక్టర్ బోర్డు తిప్పేసి 11వ నంబర్ పెట్టాడు. అదేం విడ్డూరమో? ఎక్కడైనా 175వ నంబర్ బస్సెక్కి దిగితే, దానికి రిటర్న్ ట్రిప్పులో 175ఏ లేదా 174 అని పెట్టాలి. కానీ మరీ 11 ఏమిటీ దరిద్రం కాకపోతే!
సరే ఏం చేస్తాం? ఈ జనాలు కూడా అంతే. ఎంతిస్తే అంతా నవ్వుతూ పుచ్చేసుకుంటారు. కానీ బొత్తిగా కృతజ్ఞత లేదు. కానీ ఈ జనాలకు కృతజ్ఞత లేకపోవడం కూడా నాకు కలిసివస్తుంది. మొన్న ఆయన్ని దించేశారు. నిన్న నన్ను దించేశారు. కనుక రేపు ఆయనని దించేస్తారు.
ఆ ధైర్యంతోనే కళ్ళు మూసుకొని 5 ఏళ్ళు గడిపేయవచ్చని అందరికీ చెపుతున్నా. కానీ ఎవరికీ నా లెక్కలు, లాజిక్ అర్ధం కావడం లేదు. అందరికీ నా అంత తెలివి తేటలు ఉండవుగా? నాడు సోక్రటీస్‌ని ఎవరైనా అర్ధం చేసుకోగలిగారా? ఇప్పుడూ అంతే!
సరే! ఎన్నికలలో పొత్తులు పెట్టుకుంటే మాత్రం ఎంతకాలం కలిసి ఉండగలరు? ఒకవేళ ఉండాలనుకున్నా ఉండనిస్తామా? అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను.
వాళ్ళని విడదీయడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. నాడు భగీరధుడు, విక్రమార్కుడు, గజినీ ఘోరీ మహ్మద్ కూడా మా అంత పట్టుదలగా ప్రయత్నించి ఉండరేమో?
మేము గ్యాస్ కటింగ్ చేసి వాళ్ళని విడదీద్దామనుకుంటే, మేమేదో వెల్డింగ్ చేసి అతికించేస్తున్నట్లు ముగ్గురూ ఇంకా ఇంకా అతుక్కుపోతున్నారు.
ఈ జనాలు నన్ను దించేసినా ఇంత బాధ పడలేదు. కానీ వీళ్ళ ముగ్గురి ఇకఇకలు, పకపకలు చూస్తే కడుపు మండిపోతోంది. ఎన్ని ఇనో ప్యాకెట్లు వేస్తున్న ఈ మంట తగ్గడం లేదు.
అసలీ పవన్ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక లేదా?ఎంత సేపూ చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతుంటాడు? ఆ కుర్చీలో లోకేష్ కూర్చుండిపోతే నా పరిస్థితి ఏమిటనే ఆలోచన కూడా లేదా?
ఈ లోకేష్ కూడా ‘ఆ కుర్చీ నాకు అక్కరలేదు మీరే కూర్చోండి,’ అన్నట్లు ‘అన్నా అన్నా…’ అంటూ పవన్ కళ్యాణ్ వెనక చంటి పిల్లాడిలా తిరుగుతుంటాడు.
వీళ్ళ ముగ్గురి వాలకం అస్సలు అర్ధం కావడం లేదు. అయినా పర్వాలేదు. విశ్వాసం లేని ఈ జనాలపై నాకు చాలా నమ్మకముంది. వాళ్ళే మమ్మల్ని 175వ నంబర్ బస్సెక్కిస్తారు తప్పకుండా!
In a massive celebration of Telugu pride, Telangana Chief Minister A. Revanth Reddy formally unveiled…
Indian professionals in the United States are facing growing uncertainty due to new USCIS policies…