
“చంద్రబాబు అరెస్ట్…చంద్రబాబు విడుదల” రెండింటి పై రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు తమతమ రాజకీయాలను చేస్తూ ముందుకెళుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా నేతలు బాబు జైలు కెళ్లడంతో టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటే తెలంగాణాలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నేతలు మాత్రం బాబుకి బెయిలు వచ్చిన సందర్భంగా టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
ఒకరు బాధలో ఉంటే సంబరాలు చేసుకునే వారిని ఏమంటారో వారి విజ్ఞతకే వదిలేద్దాం. వైసీపీ తానూ వచ్చే ఎన్నికలలో తిరిగి అధికారం దక్కించుకోవాలంటే బాబుని అరెస్టు చేసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టి టీడీపీ పార్టీని నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో అరెస్టుతో ముందడుగు వేసింది. ఇంకా మరికొన్ని అడుగులు కూడా వేయడానికి ప్రయత్నిస్తుంది.
అలాగే తెలంగాణాలో ముఖ్యంగా హైద్రాబాద్ వంటి మహా నగరంలో సెటిలర్స్ పాత్రే కీలకం. కనుక ఏపీ రాజకీయాలను ప్రభావం చేసే ఎటువంటి నిర్ణయం పైనైనా ఇక్కడి ప్రజలలో వినూత్న స్పందన కనిపిస్తుంది. అందువల్లనే అధికారంలో ఉన్న వారు తిరిగి అధికారం దక్కించుకోవాలన్నా, ప్రతిపక్షంలో ఉన్న వారు అధికారం దిశగా అడుగులు వేయాలన్న ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ సెటిలర్సే.
అందువల్లనే బిఆర్ఎస్ నేతలు ఏపీలో రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ వైరాన్ని గమనిస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బాబు అరెస్టు ను ఏపీ ప్రజలతో పాటు తెలంగాణలో ఉన్న ఐటీ ఉద్యోగులు కూడా వ్యతిరేకించడం,నిరసన తెలపడం వంటి కార్యక్రమాలు చేయడంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగానే బిఆర్ఎస్ నేతలు బాబు అరెస్టు ను ఖండించడం, బాబు విడుదల కావాలని ఆశించడం జరిగింది.
ఎవరి కోరిక బలంగా పనిచేసిందో కానీ తాత్కాలికంగా బాబుకి బెయిలు తో కొంత ఊరట దక్కింది. జైలు నుండి విడుదలైన బాబుకి వచ్చిన వినూత్న స్పందన చూసిన రాజకీయ పార్టీలు తాము చేసిన తప్పేమిటో కొన్ని పార్టీలు తెలుసుకుంటే, అలాగే చేయాల్సిన పనులేమిటో మరికొన్ని పార్టీలు గ్రహించాయి. అందులో భాగమే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి నాయకత్వంలో బిఎన్ రెడ్డి నగర్ లో బిఆర్ఎస్ పార్టీ నేతల సంబరాలు.
చంద్రబాబుకు బెయిలు రావడం తమకెంతో ఆనందంగా ఉందంటూ స్వీట్లు పంచుకున్నారు ఏమ్మెల్యే, ఆయన అనుచరులు. బాబు పై ప్రజలలో ఉన్న సానుభూతిని తనకు అనుకూలంగా మరల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇలా ఒక్కొక్క పార్టీ.., ఒక్కో నేత ఒక్కో ఆలోచనతో తెగ ఆరాట పడుతున్నట్టుంది పరిస్థితి చూస్తుంటే.ఇంతకీ ఇందులో ఎవరి స్వీట్లు చేదుగా మారతాయో…ఎవరి టపాసులు తుస్సుమంటాయో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…
Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…