వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలలో ఓ స్పెషల్ బ్యాచ్ ఉంది. దానిలో అందరూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను ఎద్దేవా చేస్తూనే ఉంటారు. వారి నోరు, మాటకారితనం అంతా కేవలం అందుకే ఉపయోగిస్తారు తప్ప తమ జిల్లాలలో ప్రభుత్వం ఏమైనా పనులుచేయిస్తున్నట్లయితే వాటి గురించి లేదా తమ తమ నియోజకవర్గాలలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం తాము చేస్తున్న కృషిని చెప్పుకోవడానికి వినియోగించకపోవడం వైసీపీ దురదృష్టమే.
ఆ బ్యాచ్‌లో నెల్లూరు అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా వారిలో ఒకరు. ఆయన పనితీరు నచ్చకనే జగన్ ఆయనను మంత్రి పదవి నుంచి పీకేశారు. పైగా ఆయనకు కూడా ‘బాబాయ్’ (రూప్ కుమార్ యాదవ్) శాపం వెంటాడుతూనే ఉంది. ఆ కారణంగా వచ్చే ఎన్నికలలో టికెట్ లభిస్తుందో లేదో తెలీదు. అయినా అనిల్ నోరు విప్పితే మాత్రం కట్టడి చేసుకోవడం చాలా కష్టమే.
నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, “ఆ పవన్ కళ్యాణ్ వారాహి వేసుకొని తిరుగుతున్నాడు కానీ అతనికి ఆ పెట్రోల్ ఖర్చు కూడా దండగే. దాని మీద ఎంత తిరిగినా ప్రయోజనం లేదు. ఎన్నికలైపోగానే అతను మళ్ళీ సినిమాలు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. కానీ ఆయనను నమ్ముకొని బైకులు వేసుకొని వారాహి వెనక తిరుగుతున్న పిల్లకాయలు మాత్రం నష్టపోతున్నారు.
ఐదేళ్ళపాటు చదువు సంధ్యలు లేకుండా, పనీపాటు చేసుకోకుండా ఆయన వెనకాల తిరిగారు. ఇంకో 5 ఏళ్ళపాటు మళ్ళీ తిరుగుతున్నారు. అంటే జీవితంలో అతి ముఖ్యమైన 18-25 ఏళ్ళ వయసులో 10 ఏళ్ళు వేస్ట్ చేసుకొన్నారన్న మాట!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఏమీ పీకలేకపోయినా వెళ్ళి మళ్ళీ సినిమాలు చేసుకొంటాడు. కనుక ఆయనకేమీ నష్టం లేదు. కానీ ఆయనను నమ్ముకొని బైకులు వేసుకొని ఆయన వెనక తిరుగుతున్న పిల్లకాయల పరిస్థితి అయోమయంగా మారబోతోంది,” అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్లను ఉద్దేశ్యించి సరిగ్గా ఇదే చెప్పారు. జీవితంలో అతి ముఖ్యమైన 18-25 ఏళ్ళ వయసులో రోజుకి రూ.160 జీతం కోసం వాలటీర్లుగా పనిచేస్తూ జీవితాలను పాడుచేసుకొంటున్నారని అన్నారు. వాలంటీర్ల శ్రమని జగన్ దోచుకోవడమే కాకుండా తన నేరాలలో వారిని కూడా భాగస్వామిగా చేస్తున్నారని, భవిష్యత్‌లో జైలుకి వెళ్ళవలసిరావచ్చని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ వెనక తిరుగుతున్నవారిలో చాలా మంది విద్యార్థులు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కార్పెంటర్ వంటి పనులు చేసుకొనే కుర్రాళ్ళు, ఇంకా అనేక రంగాలలో ఉన్నవారు ఉన్నారు. వారిలో ఎవరూ కూడా వాలంటీర్లలాగ ప్రజల డేటా కలెక్ట్ చేయడం వంటి నేరాలు కూడా చేయరు. కనుక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా కాకపోయినా, ఆయన వెనక తిరిగినందుకు వారు నష్టపోయేది ఏమీ ఉండదు. కానీ వాలంటీర్లు వారి జీవితంలో అమూల్యమైన సమయం కోల్పోవడమే కాకుండా జైలుకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది.



