
ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ప్రవాహంలా వచ్చి పడేవి. ఏపీలో ఉన్నవి, ఏపీకి రావలసినవి కూడా వెళ్ళిపోతుండేవి. ‘మన బంగారం మంచిది కానప్పుడు ఎవరిని అనుకొని ఏం ప్రయోజనం?’ అని అందరూ జరుగుతున్నవాటిని ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు.
ఇప్పుడు ఏపీకి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు జరుగుతున్న అభివృద్దిని చూసి తెలంగాణ ప్రజలు నిట్టూర్పు విడుస్తున్నారు.
అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో తెలంగాణ వెనకబడిపోవడానికి ఎవరు కారణం?అంటే మీరంటే మీరేనని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు వాదించుకుంటున్నాయి. నిజానికి ఆ రెండు పార్టీల మద్య జరుగుతున్న రాజకీయాలే తెలంగాణకు నష్టం కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడం నేటికీ ఆ పార్టీ అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. కనుక తమ రాజకీయాలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
కనుక ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కమీషన్, ఎఫ్-1 రేసింగ్ వంటి కొన్ని మందులు వేసి బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేయాలని ప్రయత్నించారు. కానీ వాటికి కేంద్రం అనుమతించకపోవడంతో ఆగిపోవలసి వచ్చింది.
దీంతో బీఆర్ఎస్ పార్టీ ఇంకా రెచ్చిపోతోంది. కనుక కాంగ్రెస్ పార్టీ కూడా రెచ్చిపోక తప్పడం లేదు. ఇలా రెండు పార్టీలు రాజకీయాలు చేసుకుంటుంటే అభివృద్ధి, పెట్టుబడులు తగ్గుతాయి… అని తెలిసి ఉన్నప్పటికీ రెండూ వెనక్కు తగ్గలేని పరిస్థితి.
తెలంగాణలో నెలకొన్న ఈ రాజకీయ పరిస్థితి కూడా ఏపీకి కలిసి వస్తోంది. పైగా సిఎం చంద్రబాబు నాయుడు ఇమేజ్, నారా లోకేష్ కృషి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలు వంటి అనేక అంశాలు ఏపీకి సానుకూలంగా మారాయి. ఒకప్పుడు తెలంగాణకు ఏవిదంగా భారీ పెట్టుబడులు, ఐటి కంపెనీలు వస్తున్నాయో ఇప్పుడు ఏపీకి అంతకంటే ఎక్కువే వస్తుండటం చాలా సంతోషకరమే. వరుస దెబ్బలు తిన్న ఏపీకి ఈ ఉపశమనం చాలా అవసరమే.
కానీ ఈ పెట్టుబడులు, ఐటి కంపెనీలు, ఈ అభివృద్ధి అన్నీ ఇలాగే కొనసాగాలనుకుంటే ప్రజలు మళ్ళీ రాజకీయ ప్రయోగాలు చేయకూడదు. కనుక చేస్తే ఈసారి ఏపీలో జరగబోయేవాటిని, వాటి పర్యవసానాలను ఎవరూ భరించలేరు కూడా. అంత భయంకరంగా ఉంటాయి. ప్రజలకు రాజకీయ చైతన్యం చాలా అవసరమే కానీ అదే వారికీ, రాష్ట్రానికి శాపంగా మారకూడదు కదా?
Nikhil Siddhartha is preparing for his upcoming film, Swayambhu. The makers are working to bring…
GV Prakash is having the kind of year that can easily be called a golden…