
ప్రజాసమస్యలపై ఛార్జ్ షీట్ పేరిట ఏపీ బిజెపి బుదవారం గుడివాడలో ఓ కార్యక్రమం నిర్వహించింది. దానిలో ఏపీ బిజెపి ఇన్‌ఛార్జ్ సునీల్ ధియోధర్ ఏమన్నారంటే, “జైలుకి వెళ్ళి వచ్చిన ఓ ఖైదీ, బూతులు మాట్లాడే ఎమ్మెల్యేల పాలనలో ఏపీ అధోగతి పాలయ్యింది. అధికార పార్టీలో అవినీతిపరులు రాష్ట్రాన్ని దోచేసుకొంటుంటే, పార్టీలో అరాచకవాదులు రాష్ట్రంలో అరాచకామ్ సృష్టిస్తున్నారు. ఇసుక, మద్యం, గంజాయి మాఫియాలు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి రాష్ట్రాన్ని దోచుకొని మూటలు కట్టి తాడేపల్లి ప్యాలస్‌కు పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలన ఆలీబాబా 40 దొంగల రాజ్యంగా మారింది. ప్రజాధనాన్ని, ఆస్తులను, లూటీ చేస్తున్న జగన్ ప్రభుత్వంపై క్రిమినల్ ఛార్జ్ షీట్ వేయాల్సి ఉంది.
తాడేపల్లి ఎమ్మెల్యే కొడాలి నాని బూతుల మాట్లాడుతూ ఫేమస్ అయ్యారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు… ఆంధ్రావారి సంస్కృతీ సాంప్రదాయాలను మంట గలిపేస్తూ గుడివాడలో క్యాసినోలో, క్లబ్బులు నడిపిస్తూ రాష్ట్రం పరువు తీస్తుంటారు. ఏపీలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన మళ్ళీ ఎన్నడూ శాసనసభలో అడుగుపెట్టకుండా చేస్తాము. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలందరినీ జైలుకి పంపిస్తాము,” అని అన్నారు.
సునీల్ ధియోధర్ మాటలను బట్టి ఢిల్లీలోని బిజెపి నేతలకు సైతం ఏపీలో పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉందని అర్దమవుతోంది. కానీ ఏపీని, దానిని భ్రష్టు పట్టించేస్తున్నారని చెపుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని కేంద్రప్రభుత్వం దారిలో పెట్టేందుకు ప్రయత్నించకపోగా, అడిగినప్పుడల్లా అడిగినంతా అప్పులు ఇప్పిస్తూ, కేంద్ర ప్రభుత్వమే ఏపీకి మరణ శాశనాన్ని లిఖిస్తోంది.
ఇవన్నీ వాస్తవాలు కాగా, ఏపీలో బిజెపికి అధికారంలోకి వస్తుందనుకోవడం ఓ భ్రమ. ఈ వాస్తవానికి, ఆ భ్రమకు మద్య త్రిశంకు స్వర్గంలో ఏపీ బిజెపి ఉందని చెప్పవచ్చు.
అయితే బిజెపి అధిష్టానం పూర్తిగా భ్రమలో ఉందనుకోలేము కూడా. ఏపీలో అధికారంలోకి రాలేమనే సంగతి ఢిల్లీ పెద్దలకు తెలుసు కనుకనే, బిజెపికి ఉపయోగపడని ఏపీ, నాశనం అయిపోతున్నా పట్టించుకోవడం లేదని చెప్పొచ్చు. కనుక ఏపీ ప్రజలను ఆదుకొనే నాధుడు ఎవరో… ఎప్పుడొస్తారో… ఎదురుచూడాల్సిందే!
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…