
ఏపీ ఫైబర్ నెట్‌లో గత కొంతకాలంగా రగులుతున్న పొగలు, సెగలు ఒక్కసారిగా లావాలా ఎగిసిపడటంతో కొన్ని గంటల వ్యవధిలోనే చకాచకా అనేక పరిణామాలు జరిగిపోయాయి. ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి, టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
ఆయన తీవ్ర ఆరోపణలు చేసిన ఆ సంస్థ ఎండీ దినేష్ కుమార్‌ని ఆ పదవి నుంచి సిఎం చంద్రబాబు నాయుడు తొలగించారు. ఆయన ఫైబర్ నెట్‌తో పాటు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా, ఏపీ గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సీఈవోగా ఉన్నారు. ఈ మూడు పదవులను నుంచి కూడా తప్పించేసి ఏ పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు.
కానీ జీవీ రెడ్డికి రాజకీయాల తీరుతెన్నుల గురించి మంచి అవగాహన ఉన్నప్పటికీ తొందరపాటుతో లేదా ఆవేశంతోనో ఎండీ దినేష్ కుమార్‌తో సహా సంస్థలో మరికొందరు ఉన్నతాధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బహిరంగంగా ఆరోపించి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి కల్పించారు. సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహానికి గురయ్యి పదవికి రాజీనామా చేశారు.
కనీసం అక్కడితో ఆగి ఉంటే బాగుండేది కానీ ఆవేశంతో పార్టీకి కూడా రాజీనామా చేసి తన రాజకీయజీవితానికి తానే ఎండ్ కార్డ్ వేసుకున్నారు.
నేటికీ ఏపీ ఫైబర్ నెట్ ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో ప్రజలకు చేరువకానప్పటికీ, దానిలో ఈ పరిణామాలు 5జీ కంటే వేగంగా చకచకా జరిగిపోయాయని చెప్పవచ్చు.
సిఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏపీ ఫైబర్ నెట్‌లో జరిగిన ఈ పరిణామాల నేపధ్యంలో చూస్తే, కూటమి ప్రభుత్వానికి ఇవి చెడ్డపేరు తేవడమే కాక, టీడీపీ ఓ మంచి నాయకుడిని కూడా కోల్పోయిన్నట్లయింది.
ఈ వ్యవహారంలో సిఎం చంద్రబాబు నాయుడు అవసరమైతే కటినంగా వ్యవహరించడానికి వెనకాడబోనని స్పష్టమైన సంకేతం ఇచ్చారని చెప్పవచ్చు.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత దినేష్ కుమార్‌ని ఈ పదవులలో నుంచి తొలగించాల్సి రావడం చూస్తే, టీటీడీ మొదలు కాకినాడ పోర్టు, ఏపీ ఫైబర్ నెట్ వరకు ప్రభుత్వంలోని ప్రతీ వ్యవస్థలో వైసీపీ హవా నడుస్తోందనే విషయం మరోసారి బయటపడింది.
ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు కూడా రాజకీయాలు, పార్టీల గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండటం తప్పు కాదు. కానీ అవి ప్రభుత్వం, దానిలో వ్యవస్థల పనితీరుని దెబ్బ తీసేవిగా ఉండకూడదు.
కానీ ఉంటున్నాయని ఏపీ ఫైబర్ నెట్‌లో జరిగిన ఈ పరిణామాలు స్పష్టం చేశాయి. కనుక కూటమి ప్రభుత్వం మరింత అప్రమత్తంగా, చాకచక్యంగా వ్యవహరించడం చాలా అవసరం. లేకుంటే ప్రభుత్వంలో వైసీపీ కోవర్టులు చాప కింద నీరులా వ్యాపించి ముంచేసే ప్రమాదం ఉంటుంది.
Nana Patekar’s sudden demise on October 8, 2026, led to several tributes on social media.…
Nitesh Tiwari’s Ramayana is only a few weeks away from release. While the promotional strategy…