
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఓ విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొని ఉంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు వాటి ప్రభుత్వాలు తమకు ఎదురే లేదన్నట్లు వ్యవహరిస్తుంటాయి. అదే సమయంలో ప్రతిపక్షాలు తాము అధికార పార్టీ వేధింపులతో రాజకీయ బాధితులంగా మారామని అక్రోశిస్తుంటాయి.
కానీ రెండు రాష్ట్రాలలో ప్రతిపక్షాలు తాము అధికారంలోకి రాగానే ‘రప్పా రప్పా తలకాయలు నరుకుతామని’, ‘ఒక్కొక్కరి తోలు తీస్తామని’ బెదిరిస్తున్నాయి.
అధికారంలో ఉన్నవారు ఎంతో ధీమాగా ఉండాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీలు మళ్ళీ ఎన్నటికీ అధికారంలోకి రాలేవని, రాకుండా తాము అడ్డుకుంటామని, కనుక పార్టీ కార్యకర్తలు, అధికారులు, పెట్టుబడిదారులు ఎవరూ భయపడవద్దని పదేపదే విజ్ఞప్తి చేయాల్సి వస్తోంది.
ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ‘పదవి-బాధ్యత’అనే కార్యక్రమంలో మాట్లాడిన మాటలే ఇందుకు తాజా నిదర్శనం. “నా కంఠంలో ప్రాణం ఉండగా ఏపీలో మళ్ళీ వైసీపీని అధికారంలోకి రానివ్వను. అందుకోసం అవసరమైన వ్యూహాలు అమలుచేస్తూ ముందుకు సాగుతాము. కనుక అధికారులు వైసీపీ నేతల బెదిరింపులకు భయపడకుండా పనిచేయమని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యి తెలంగాణ నీటిని, సంపదని ఏపీకి దోచిపెడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. తాను మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి ‘తోలు తీస్తా’నని కేసీఆర్ హెచ్చరించారు.
జగన్ ‘రప్పా రప్పా తలకాయలు నరుకుతానని’ బెదిరిస్తుంటే, కేసీఆర్ ‘తోలు తీస్తానని’ హెచ్చరిస్తున్నారు. అంటే ఇద్దరి ఆలోచనా ధోరణి ఒకేలా ఉందన్న మాట!
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన సామాన్య ప్రజలు నష్టపోతారని వైసీపీ, పోలవరంలో నీళ్ళు వాడుకుంటే తెలంగాణకు తీరని నష్టం కలుగుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఊహాజనితమైన సమస్యల పేరుతో ప్రభుత్వాలపై దుష్ప్రచారం చేస్తుంటే వాటికి చెక్ పెట్టాల్సిన అధికార పార్టీలు, వాటికి సంజాయిషీలు ఇచ్చుకుంటుండటం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది.
మెడికల్ కాలేజీల విషయంలో టీడీపి మంత్రుల వివరణలు, నీళ్ళు, ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేసిన ఆరోపణలు తప్పని నిరూపించేందుకు త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహించబోతుండటం ఇందుకు చక్కటి నిదర్శనాలు.
అక్కడా బీఆర్ఎస్, ఇక్కడ వైసీపీ నేతలు ప్రభుత్వాలను బెదిరిస్తుంటే, మేము ధైర్యంగానే ఉన్నామని ప్రజలకి, అధికారులకు నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తూ మీరు కూడా ధైర్యంగా ఉండండని అధికార పార్టీ నేతలు నచ్చజెప్పుకోవడం కంటే దయనీయం ఏముంటుంది?
ప్రతిపక్ష పార్టీల అధినేతలు, వారి నాయకులు ఈవిధంగా బహిరంగంగా బెదిరిస్తుంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేకపోయినా కనీసం రాజకీయంగా చెక్ పెట్టే ప్రయత్నం చేయలేని నిసహాయ స్థితిలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల నిసహాయత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అందరికీ తెలుసు. కానీ అధికార పార్టీల నిసాహాయత అంత కంటే చాలా ప్రమాదకరమనే కొత్త విషయం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వాలు ఇంత నిసహాయ స్థితిలో ఉన్నాయని ప్రజలు భావిస్తే ఏమవుతుంది?
Ramayana Part 1 is arriving in a month. The movie has already created buzz with…
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…