
ఏపీలో బీజేపీకి చాలా బలముందనీ కాదు… బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టిడిపి గెలిచేస్తుందనీ కాదు. ఈ ఎన్నికలలో మళ్ళీ గెలిచేందుకు వైసీపి చొక్కా మడత పెట్టి పెట్రేగిపోతుంది కనుక నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిపించేలా కేంద్ర ఎన్నికల కమీషన్, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం పనిచేయిస్తుందనే ఆలోచనతోనే బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తుకి సిద్దపడ్డారని అందరికీ తెలుసు.
కూటమి గెలిచి అధికారంలోకి వస్తే అమరావతి, పోలవరం నిర్మాణాలకు సహకరిస్తుందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టుకునేందుకు సహకరిస్తుందనే ఆశ కూడా ఉంది. అందుకే టిడిపి, జనసేనలకు అవసరం లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకొని దాని కోసం సీట్లు త్యాగం చేశాయని అందరికీ తెలుసు.
కానీ టిడిపి, జనసేనలు కేంద్రం నుంచి ఆశించిన ఈ చిన్నపాటి సహకారం కూడా వాటికి లభించడం లేదని తాజా పరిస్థితులు చూస్తే అర్దమవుతోంది.
జగన్‌పై రాయి దాడిని ప్రధాని నరేంద్రమోడీ కూడా ఖండించారు. కానీ ఆ కేసులో టిడిపి నేత బోండా ఉమని ఇరికించడానికి వైసీపి ప్రభుత్వం కుట్రలు పన్నుతుంటే, అడ్డుకునేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు!
‘రాయి దాడి ఘటన భద్రతా వైఫల్యమే’ అని చెప్పి ముఖేష్ కుమార్ మీనా చేతులు దులుపుకున్నారే తప్ప ఆ ఘటనను వైసీపి ఎన్నికల ప్రచారానికి వాడుకోవడానికి వీలులేదని, ఆ సాకుతో తమ రాజకీయ ప్రత్యర్ధులను వేధించరాదని చెప్పలేకపోయారు!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై, తన సిబ్బందిపై బ్లేడ్ బ్యాచ్ దాడులు చేస్తోందని చెప్పినా పోలీసులు స్పందించలేదు! రాష్ట్ర ఎన్నికల సంఘమూ స్పందించలేదు. కానీ రాయి దాడి ఘటనలో పోలీసులు చాలా చురుకుగా వ్యవహరిస్తూ టిడిపి నేత, విజయవాడ సెంట్రల్ అభ్యర్ధి బోండా ఉమని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తుంటే, తద్వారా టిడిపి శ్రేణులలో భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘమూ స్పందించడం లేదు.
చివరికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా రాష్ట్రంలో పోలీస్ ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
ఇవన్నీ చూస్తున్నప్పుడు టిడిపి, జనసేనలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అవసరమా? బీజేపీ కోసం తమ సీనియర్ నేతలను కూడా కాదని సీట్లు త్యాగాలు చేసి తప్పు చేశాయా? అని అనిపించక మానదు.
టిడిపి, జనసేనలు ఇన్ని సీట్లు త్యాగాలు చేసినా వాటిలో ఎన్నిటిని బీజేపీ గెలుచుకుంటుందో తెలీదు. బీజేపీ ఓడిపోయే ప్రతీ ఒక్క సీటు వైసీపికే దక్కుతుంది. అంటే వాటి త్యాగాలు వృధాయే అనుకోవలసి ఉంటుంది.
కీలకమైన ఎన్నికల సమయంలోనే తమ రాజకీయ భాగస్వాములకు, తమ సొంత పార్టీ నేతలను కూడా బీజేపీ అధిష్టానం పట్టించుకోకపోవడాన్ని అనుమానించాల్సి వస్తోంది.
టిడిపి, జనసేనలతో పొత్తు పెట్టుకొని వైసీపికి మేలు చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. కనుక టిడిపి, జనసేనల త్యాగాలు బూడిదలో పోసిన పన్నీరుగా మారబోతోందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…