
కేంద్ర ఎన్నికల కమీషనర్ అరుణ్ గోయల్ శనివారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ దానిని వెంటనే ఆమోదించారు! నేడో రేపో లోక్సభ, నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడబోతున్న అత్యంత కీలకమైన ఈ సమయంలో ఎన్నికల కమీషనర్ రాజీనామా చేయడం, దానిని వెంటనే రాష్ట్రపతి ఆమోదించడం రెండూ ఆశ్చర్యకరమే. దేశవ్యాప్తంగా దీనిని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ 2025, ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఈసీలో ఆయన స్థానాన్ని అరుణ్ గోయల్ భర్తీ చేయాల్సి ఉంది. ఆయన పదవి కాలం డిసెంబర్ 2027వరకు ఉంది. కానీ ఇంత హటాత్తుగా ఎందుకు పదవికి రాజీనామా చేశారు? అంటే దానికి జవాబు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చెపుతోంది.
ఆ పార్టీ సీనియర్ నేత మహువా మొయిత్రా స్పందిస్తూ, “పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణ ఏర్పట్లను సమీక్షించేందుకు ఈసీ బృందం పర్యటించినప్పుడు, ఢిల్లీ నుంచి ఓ హుకుం వచ్చింది. రాష్ట్రంలో ఎన్ని దశలలో పోలింగ్ నిర్వహించాలో, భద్రతా దళాలను ఎన్ని మోహరించాలో అది సూచించింది. దానినే వ్యతిరేకిస్తూ అరుణ్ గోయల్ సమావేశం మద్యలో బయటకు వెళ్ళిపోయారు. అందుకే తన పదవికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర ఎన్నికల కమీషన్ వ్యవహారాలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని మా పార్టీ ఖండిస్తోంది,” అని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సహా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమీషన్ వ్యవహారంలో వేలు పెట్టడాన్ని తప్పు పడుతున్నారు. అరుణ్ గోయల్ రాజీనామా చేసినప్పుడు, కేంద్ర ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా, లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన రాజీనామాని వెంటనే ఆమోదించడాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి.
బీజేపీ ఈసారి 400కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో కొత్త పొత్తులకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కానీ మమతా బెనర్జీ ఆడపులిలా బీజేపీపై విరుచుకు పడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గూండాయిజం చేస్తూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ నియంత్రించాలని ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. కనుక ఆ రాష్ట్రంలో అదనపు భద్రత అవసరమని వాదిస్తోంది.
పశ్చిమ బెంగాల్లో ఏకంగా 42 ఎంపీ సీట్లున్నాయి. కనుక ఎట్టి పరిస్థితులలో వాటిలో మెజార్టీ సీట్లు సాధించుకోవాలంటే ఎన్నికలు తమ కనుసన్నలలో జరగాలని బీజేపీ కోరుకుంటోందని అందుకే తమ ఆదేశాలని వ్యతిరేకిస్తున్న అరుణ్ గోయల్ని బయటకు సాగనంపిందని తృణమూల్ కాంగ్రెస్ వాదిస్తోంది.
ఈ నేపధ్యంలో ఓ సారి ఏపీలో పరిస్థితుల గురించి కూడా మాట్లాడుకోవలసి ఉంది. ఏపీలో అధికార వైసీపి ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తూ, హైకోర్టు, ఈసీ వారిస్తున్నప్పటికీ వాలంటీర్లను ఎన్నికల కోసం వాడుకుంటోంది. శనివారం రాత్రి కొందరు మహిళా వాలంటీర్లు కుప్పం నియోజకవర్గంలో ఓటర్లను కలిసేందుకు ప్రయత్నించడమే ఇందుకు తాజా నిదర్శనం.
ఏపీలో జరుగుతున్న ఈ అక్రమాల గురించి చంద్రబాబు నాయుడు, అచ్చన్నాయుడు, పలువురు టిడిపి నేతలు కేంద్ర ఎన్నికల కమీషన్కు పలుమార్లు పిర్యాదులు చేశారు. కానీ కేంద్ర ఎన్నికల కమీషన్ స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ద చూపుతోంది. అందుకోసం ఎన్నికల కమీషనర్ అరుణ్ గోయల్ని బయటకు సాగనంపింది కూడా! కానీ టిడిపి నేతలు పిర్యాదులు చేస్తున్నా ఏపీలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
Mrunal Thakur has not signed a new film in nearly nine months. However, it is…
Mumbai Indians have reportedly shut down rumours of Rohit Sharma returning as captain for IPL…