“బాహుబలి” అనే సినిమా తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేసింది. ప్రతి తెలుగోడు గర్వంగా ఫీలయ్యేలా, ప్రతి భారతీయుడు ఇది మా సినిమా అని చెప్పుకొనేలా చేసిన సినిమా “బాహుబలి”. ఒక కథని రెండు భాగాలుగా చూసే అలవాటు లేక “బాహుబలి” పార్ట్ 1 కి నెగిటివ్ టాక్ వచ్చింది తప్పితే.. బాహుబలిని తెలుగోళ్లు ఓన్ చేసుకున్నట్లుగా, ఆ సినిమాని ఆదరించినట్లుగా మరెవరూ చేయలేదు.
సినిమా రిలీజై దాదాపు 11 ఏళ్లవుతోంది. మణిరత్నం, శంకర్, ప్రశాంత్ నీల్ లాంటి దేశం మెచ్చిన దర్శకులు సైతం తమకు ఇన్స్పిరేషన్ రాజమౌళి అని బాహాటంగా చెప్పుకున్న సందర్భాలు కోకొల్లలు. పాన్ ఇండియన్ సినిమా అనే పదానికి, జోనర్ కి అంకురార్పణ చేసిన “బాహుబలి” రెండు భాగాలు కలిపి ఇటీవల రీరిలీజ్ చేయగా దానికి కూడా బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది.
“బాహుబలి” ప్రపంచం నుండి వెబ్ సిరీస్ ఒకటి ప్లాన్ చేసిన నెట్ ఫ్లిక్స్ దాన్ని తర్వాత స్క్రాప్ చేశారు. హాట్ స్టార్ చేసిన సిరీస్ కి పెద్ద రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు రాబోతున్న యానిమేషన్ సినిమా పరిస్థితి ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇలాంటి తరుణంలో.. “బాహుబలి 3” ఉండొచ్చు అని ప్రభాస్, రానా, అనుష్క హింట్ ఇవ్వడం అనేది చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు ప్రభాస్ కి, రాజమౌళికి ఉన్న కమిట్మెంట్స్ & అనుష్క ఉన్న సిచ్యుయేషన్ కి “బాహుబలి 3” అనేది ఎంతవరకు కుదురుతుంది? ఒకవేళ కుదిరినా ఫ్రాంచైజ్ ను మిల్క్ చేయడమే అవుతుంది తప్ప, నిజంగా “బాహుబలి 3” అనేది ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేయగలదా? 12 ఏళ్ల క్రితమే బాహుబలి కోసం 450 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు పార్ట్ 3 అంటే బడ్జెట్టే వేల కోట్లలో ఉంటుంది.
ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితికి, ప్రభాస్ & రాజమౌళి మళ్లీ అన్నేళ్లపాటు ఒక సినిమా మీద ఉండిపోవడం అనేది శ్రేయస్కరం కాదు. ఒకవేళ సినిమా విడుదలై వేల కోట్ల రూపాయు కొల్లగొట్టినా.. ఈ తరహా సినిమాలు చూసి మళ్లీ మిగతా మేకర్స్ వాతలు పెట్టుకోవడం తప్ప ఇండస్ట్రీకి ఒరిగేది కూడా ఏమీ లేదు. మరి రాజమౌళి ఈ విషయంలో ఏమంటారు? “బాహుబలి 3” అనే ఆలోచన తనకైతే లేదని రాజమౌళి పలుమార్లు చెప్పారు. “బాహుబలి 3” కంటే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి “మహాభారతం” మొదలెట్టడం మంచిది.




