పాలు, కాలేజీలు, పచ్చళ్లు, చిట్ ఫండ్స్ మీవే ఉండాలా? ఇండస్ట్రీ, సినిమాలు మీ వాళ్లే చేయాలా అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులను ఉద్దేశించి సీఎం జగన్ ఏపీ అసెంబ్లీ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు.. సాధారణ ప్రజలు కూడా నిరసననను వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్స్ కామెంట్స్ రూపంలో వ్యతిరేఖ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ ఘాటు వ్యాఖ్యలతో కౌంటర్ ఇచ్చారు. జగన్ చేసిన వ్యాఖ్యలను దయ్యబట్టారు. ఇంతకీ ఆయన ఏమన్నారు? జగన్ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అయ్యారనే వివరాల్లోకి వెళితే..
బండ్ల గణేష్ మాట్లాడుతూ ‘‘పాలు ఆరోగ్యాన్నిస్తాయి. పచ్చళ్లు రుచులనిస్తాయి. చిట్‌ఫండ్లు మన జీవితాల్ని సరిచేస్తాయి. సినిమాలు వినోదాన్నిస్తాయి. కాలేజీలు మనకు విజ్ఞానాన్ని, భవిష్యత్తును ఇస్తాయి. ఈ వ్యాపారాల్లో ఏమైనా తప్పుందా? ఇవేమైనా తప్పుడు వ్యాపారాలా? మందు వ్యాపారాలు చేస్తే తప్పు. మాఫియా వ్యాపారం చేస్తే తప్పు. దోచుకుంటే తప్పు. భయపెట్టి గుంజుకుంటే తప్పు. గనులు దోచుకుంటే తప్పు. ఇవేమీ మేము చేయడం లేదు. కష్టపడి, ఇష్టపడి ఎక్కడ వనరులు ఉంటే అక్కడికెళ్లి అక్కడికి పోయి పని చేసుకుని బతికి అందరి తల్లో నాలుకలా ఉండేవాడే కమ్మవాడు. మమ్మల్ని చూసి మమ్మల్ని ఆదర్శంగా తీసుకోని మీరు పైకి రండి కానీ, మామీద పడి ఏడిస్తే మీకేమి వస్తుంది. మా జాతిలో పుట్టిన కొందరు దరిద్రులు, నీచులు మమ్మల్ని, మా వాళ్లని తిడుతుంటే కడుపు రగిలిపోయి మాట్లాడుతున్న మాటలివి. ఒక్కసారి మనస్సాక్షిని క్వశ్చన్ చేసుకోండి.
మనం చేసే వ్యాపారంలో ఏమైనా తప్పుందా? ఫిల్మ్ సిటీ కడితే తప్పా? పేపర్ పెట్టుకుంటే తప్పా? జనాలకు వినోదాన్ని అందించే సినిమాలు తీస్తే తప్పా? ప్రపంచానికి పచ్చళ్ల రుచులు చూపిస్తే తప్పా? మిమ్మల్ని ఎవరు పెట్టొద్దన్నారు? పెట్టండి. స్వాగతిస్తాం. కావాలంటే సలహాలిస్తాం. మాకు దోచుకోవడాలు, మందు వ్యాపారాలు చేయడాలు.. చీప్ లిక్కర్లు అమ్ముకునే వ్యాపారాలు మాకు రావుగానీ, మంచి వ్యాపారాలు చేయాలనుకుంటే మా పెద్దలు, మా జాతివాళ్లు, మా జాతికి సంబంధించిన ఎవరైనా మీకు సలహాలు ఇస్తారు. ప్లీజ్ దయచేసి మమ్మల్ని చూసి అక్కసు పడొద్దు. మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి’’ అని అన్నారు బండ్ల గణేష్.
మరి బండ్ల గణేష్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.



