చిత్రం: భోగి
M9 రేటింగ్: 1/5
విడుదల తేదీ: నవంబర్ 27, 2026
తారాగణం: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, శరత్ లోహితస్వ, అవినాష్ ఎలందూర్, డింపుల్ హయాతి తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీసత్యసాయి ఆర్ట్స్
దర్శకత్వం: సంపత్ నంది
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నిర్మాత: కేకే రాధామోహన్
ఛాయాగ్రహణం: కిషోర్ కుమార్
కూర్పు: తమ్మిరాజు
సంపత్ నంది – శర్వానంద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “భోగి”. సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో మంచి హిట్ అందుకున్న శర్వానంద్ ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయడం కోసం చేసిన ఈ ప్రయత్నం ఏమేరకు ఫలించింది అనేది చూద్దాం..!!
కథ:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ జిల్లాలకు చెందిన బొగ్గులగుట్ట అనే ఊర్లో పటేల్ వ్యవస్థలో తన ఐదుగురు చెల్లెళ్లు కలిసి సంతోషంగా కమ్మరి పని చేసుకుంటూ బ్రతుకుతుంటాడు గంగ (శర్వానంద్). ఆ ఊరిపెద్ద పటేల్ (శరత్ లోహితస్వ) గ్రామానికి ఎలాంటి సమస్య వచ్చినా.. ఓ ప్రత్యేకమైన పూజ నిర్వహించి, ఊరిని కాపాడుకుంటూ ఉంటాడు.
ఇంతకీ పటేల్ చేస్తున్న పూజ ఏంటి? ఆ పూజ నిజంగానే గ్రామానికి మంచి చేస్తుందా? ఈ నమ్మకం కారణంగా గంగకు జరిగిన అన్యాయం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “భోగి” చిత్రం.
నటీనటుల పనితీరు:
శర్వానంద్ కుదిరినంతలో సహజంగా కనిపించడానికి, నటించడానికి ప్రయత్నించాడు, కొంతమేరకు సక్సెస్ అయ్యాడు కూడా. అయితే.. క్యారెక్టర్ ఆర్క్ లో సత్తా లేకపోవడం, సెంటిమెంట్స్ ను హ్యాండిల్ చేసిన విధానంలో క్లారిటీ లేకపోవడంతో శర్వానంద్ కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.
అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా హీరోయిన్ అనే విషయాన్ని గుర్తించడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఇక డింపుల్ హయాతి కళ్ళు ఈ సినిమాలో ఎలాంటి కీరోల్ పోషించాయో అర్థం చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా.. కనిపించలేదు. ఇక ఆమెతో ఆడతనం, మగతనం గురించి చెప్పించిన సంభాషణల్లో ప్రాసలు పొంగి పొర్లగా.. వినడానికి మాత్రం ఎబ్బెట్టుగానే ఉన్నాయి.
ఇక కన్నడ నటులు శరత్ లోహితస్వ, అవినాష్ ఎలందూర్ లు నటన పరంగా తమ 100% ఎఫర్ట్స్ పెట్టినా.. ఆ పాత్రలు డిజైన్ చేసిన విధానంలో కొత్తదనం లోపించడం, ముఖ్యంగా అవినాష్ క్యారెక్టర్ కి పెట్టిన ట్విస్ట్ అనేది వర్కవుట్ అవ్వకపోవడంతో వాళ్ల పాత్రలు చిరాకు తెప్పించడం తప్ప పెద్దగా ఉపయోగపడలేదు. ఇక పోలీస్ గా కనిపించిన రోహిత్ పతక్ తో చేయించిన ఓవర్ యాక్షన్ & సెన్స్ లెస్ సీన్స్ నీరసంతో కూడిన అసహ్యాన్ని కలిగిస్తాయి.
సాంకేతికవర్గం పనితీరు:
చంద్రబోస్ సింగిల్ కార్డ్ క్రెడిట్ తీసుకుని సోలోగా రాసిన సాహిత్యం, ఆ పాటల కొరియోగ్రఫీలో.. లిరికల్ మీనింగ్ ని విజువల్ గా ప్రెజెంట్ చేసిన విధానమొకటి బాగుంది. అయితే.. ఆ పాటల ప్లేస్ మెంట్ కానీ, పాటగా కానీ అలరించలేదు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ లో సన్నివేశంతో సంబంధం లేకుండా భీమ్స్ కొట్టుకుంటూ వెళ్లిపోయిన విధానం చూస్తే.. నిజంగా సినిమాని చూసే మ్యూజిక్ చేశాడా అని డౌట్ రావడం ఖాయం.
ఆర్ట్ & కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ మాత్రం 1960ల నాటి స్థితిగతులను తెరపై చూపించడం కోసం పడిన శ్రమ అభినందనీయం. బ్యాగ్రౌండ్ ఆర్టిస్టులు, జూనియర్స్ విషయంలో తీసుకున్న కేర్ కూడా బాగుంది.
సంపత్ నంది రాసుకున్న కథలో కొత్తదనం ఎలాగూ లేదు. కనీసం కమర్షియల్ ఫార్మాట్ లో నైనా మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా ఉందా అంటే అదీ లేదు. అసలు సినిమాని స్టార్ట్ చేసిన విధానానికి, ముగించిన తీరుకి సంబంధం ఉండదు. “మంగళవారం” తరహా ఊహించని ట్విస్ట్ తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేద్దామని చేసిన విఫల ప్రయత్నం తప్ప.. ఒక రచయితగా, దర్శకుడిగా సంపత్ నంది తాలుకు బేసిక్ ఎఫర్ట్స్ కూడా కనిపించలేదు. ఆడియన్స్ ను గ్రాంటెడ్ గా తీసుకున్నారా? లేక మాస్ అంటే ఇంతే అనుకుంటున్నారో తెలియదు కానీ.. తెరపై మనుషుల తలల్ని రకరకాలుగా నరుకుతుంటే.. ఎక్కడలేని చిరాకొస్తుంది.
ఇక ఈ సినిమాలో సంపత్ నంది ఏదో మాస్ హిస్టీరియా తీసేస్తున్నాను అనే భ్రమలో ఏకంగా 20కి పైగా తలకాయలు కనిపించడం, ఏదో వండర్ లా లో వాటర్ గేమ్స్ లో నీళ్లు తుళ్లినట్లు.. శర్వానంద్ మీద పిచికారీ చేసిన లీటర్ల కొద్దీ రక్తం బడ్జెట్ తో ఒక చిన్న సినిమా తీయొచ్చేమో.
భోగి సినిమాతో సంపత్ నంది దర్శకుడిగా, రచయితగా దారుణంగా ఫెయిల్ అయ్యాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. మాస్ ఎలిమెంట్స్ ను సరిగ్గా వినియోగించుకోగల సత్తా ఉన్న సంపత్ నంది లాంటోళ్లు కూడా ఇలా మాసిపోయిన మాస్ ను పట్టుకొని వేలాడడం అనేది బాధాకరం.
విశ్లేషణ:
సినిమా మొత్తానికి కీలకమైన మూఢ నమ్మకాన్ని తెరపై బలంగా ప్రెజెంట్ చేయలేనప్పుడు.. దాని చుట్టూ ఎంత సెంటిమెంట్ రుద్దినా వర్కవుట్ అవ్వదు. అలాంటప్పుడు 107 తలకాయలతోపాటు మరో 20 తలకాయలు నరికి.. ఆ తలలతో భోగి పళ్లు పోసినా కూడా ఎమోషన్ పండదు.
ఈ విషయాన్ని సంపత్ నంది మూడేళ్ల పాటు సినిమాపై వర్క్ చేసినా తెలుసుకోలేకపోవడం బాధాకరం. ఇక శర్వానంద్ లాంటి నటుడు మాస్ హీరో ఇమేజ్ కోసం పడే తాపత్రయంలో సగమైనా మంచి కథను ఎంచుకునే విషయంపై పెడితే కాస్త బెటర్ సినిమాలొస్తాయి. లేదంటే.. ఇలా విడుదలైన విషయంలో జనాలకి తెలిసేలోపే థియేటర్ల నుండి సినిమా మాయమైపోయే భోగీలు, జోగీలే గతి.
ఓవరాల్ గా.. భోగి మంటల్లో మాడిపోయిన మాస్ రస్టిక్ టెంప్లేట్!
M9 రేటింగ్: 1/5





