ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గురువారం 3,240 పంచాయతీలకు ఎన్నికలు జరుగగా వాటిలో సర్పంచ్ పదవులకు పోటీ పడినవారిలో కూటమి మద్దతుదారులు 1,835 మంది విజయం సాధించారు. వారిలో టీడీపీ: 1,661, జనసేన: 150, బీజేపీ: 24 మంది విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి చెందినవారు 906 మంది, ఇతరులు: 113 మంది విజయం సాధించారు.
ఏకగ్రీవంగా దక్కించుకున్న 708 సీట్లను కూడా కలిపితే కూటమి: 2,543, వైసీపీ మద్దతుదారులు మొత్తం 952 పంచాయతీలు గెలుచుకున్నారు. మిగిలిన పంచాయతీలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
మున్సిపల్ ఎన్నికలు పట్టణ, నగర ప్రజల తీర్పుకు అద్దం పడితే, పరిషత్, ఎంపీపీ, పంచాయతీ ఎన్నికలు గ్రామీణ ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయి. కనుక ఇప్పటి వరకు జరిగిన ఈ ఎన్నికలను, వచ్చిన ఫలితాలను మొత్తంగా చూసినట్లయితే, నగర, పట్టణ, గ్రామ ప్రజలు కూటమి పార్టీలకే మొగ్గు చూపుతున్నారని స్పష్టం అవుతోంది.
అంటే కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన, దాని విధానాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు భావించవచ్చు. అలాగే రాజధాని అమరావతి విషయంలో కూడా వైసీపీ వాదనలను ప్రజలు తిరస్కరించినట్లే భావించవచ్చు.
వైసీపీ 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పుడు, అది చంద్రబాబు నాయుడు పాలనకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పుగా అభివర్ణించింది. కానీ 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైనప్పుడు, ఈవీఎంల కారణంగా ఓడిపోయామని జగన్ వాదించారు.
ఇప్పుడూ అదేవిధంగా వాదిస్తున్నారు. గెలిచిన స్థానాలు ప్రజాతీర్పుకు నిదర్శనమని, ఓడినచోట్ల కూటమి ప్రభుత్వ అరాచకాలు కారణమని వాదిస్తున్నారు. కానీ వైసీపీ ఎటువంటి వాదనలు చేసినప్పటికీ, ఈ ఎన్నికల్లో విజయమే పార్టీల సమర్థతకు, ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా నిలుస్తుంది కదా?
ఈ నెల 29న రెండో దశ, డిసెంబర్ 2న మూడో దశ పంచాయతీ ఎన్నికలు (పోలింగ్) జరుగుతాయి. ఈ మూడు దశల్లో అవసరమైతే మర్నాడే రీపోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.




