
ఏపీలో టిడిపి, జనసేన, బీజేపీల మద్య పొత్తులు, సీట్ల సర్దుబాట్ల ప్రక్రియ పూర్తయి చాలా రోజులే అయ్యింది. కనుక బీజేపీ అభ్యర్ధులను ప్రకటించుకోవచ్చు. కానీ ఇంతవరకు ప్రకటించలేకపోయింది.
దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఎవరెవరికి ఏ సీట్లు ఇవ్వాలనేది ఒకటైతే, వారికి టిడిపి, జనసేనల మద్దతు లభిస్తుందా లేదా అనేది రెండోది.
పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి టిడిపి, జనసేనల ప్రభంజనం నెలకొని ఉంది కనుక టిడిపి, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగాల అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కనుక బీజేపీలో టికెట్ల కోసం చాలా మందే పోటీ పడటం సహజం కనుక వారిలో గెలుపు గుర్రాలను గుర్తించి టికెట్లు ఇచ్చుకోవలసి ఉంటుంది. ఇందు కోసమే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ వెళ్ళారు కూడా. అయితే ఆమె వెళ్ళడానికి మరో కారణం కూడా ఉంది.
ఈసారి టిడిపి, జనసేనలతో కలిసి బీజేపీ పోటీ చేయబోతోంది కనుక ఆ రెండు పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్ధులనే ఎంపిక చేయాలని, లేకుంటే బీజేపీకి దక్కిన సీట్లు వైసీపి గెలుచుకుంటే పొత్తు ప్రయోజనం నెరవేరదని చెప్పేందుకు ఆమె తమ అధిష్టానానికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ బీజేపీలో టిడిపి, జనసేనల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సోము వీర్రాజు, పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, విష్ణు వర్ధన్ రెడ్డి నలుగురు టికెట్స్ ఆశిస్తున్నారు.
వారిలో సోము వీర్రాజు అనపర్తి నుంచి, జీవీఎల్ విశాఖ నుంచి, పీవీఎన్ మాధవ్ అనకాపల్లి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. వీరు నలుగురు మొదటి నుంచి బీజేపీలోనే ఉన్నప్పటికీ, వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా లేదా ఎంతో కొంత అనుకూలంగా వ్యవహరిస్తూ, మాట్లాడుతుండేవారు.
వీరిలో ఇద్దరికి జనసేనతో పొత్తు ఇష్టం లేదు. వీరి నలుగురికీ కూడా టిడిపితో పొత్తు అసలు ఇష్టం లేదు. కనుక మూడు పార్టీలు పొత్తులు పెట్టుకోకుండా ఆపేందుకు, తర్వాత ఆలస్యం జరగడానికి వీరు నలుగురే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే టిడిపి, జనసేనలు కూడా వీరి నలుగురినీ వ్యతిరేకిస్తున్నాయి.
ఇప్పటికే బీజేపీతో పొత్తు కారణంగా టిడిపి, జనసేనలలో పలువురు టికెట్లు కోల్పోయారు. వారందరూ బీజేపీపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ప్రజలకు కూడా బీజేపీపై సదాభిప్రాయం లేదు. కనుక టిడిపి, జనసేనలను చూసే బీజేపీకి ఓట్లు వేస్తే వేస్తారు లేకుంటే లేదు. కనుక ఏపీ బీజేపీ అభ్యర్ధులకు టిడిపి, జనసేనల సంపూర్ణ మద్దతు, సహాయ సహకారాలు లేనిదే, ఎన్నికలలో ఆ రెండు పార్టీల ఓట్లు బీజేపీకి బదలాయింపు జరిగే అవకాశమే ఉండదు.
దగ్గుబాటి పురందేశ్వరి ఇదే విషయం తమ అధిష్టానానికి చెప్పి అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్ధులను ఎంపిక చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏపీ బీజేపీ అభ్యర్ధుల ప్రకటన ఆలస్యం అవుతున్నట్లు భావించవచ్చు.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…