తెలంగాణలో బీజేపీకి క్లారిటీ ఉంది కానీ ఏపీలో…

Telangana BJP

త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాల నుంచి పోటీ చేయబోయే 195 మంది అభ్యర్ధులతో తొలి జాబితా శుక్రవారం రాత్రి విడుదల చేసింది.

దానిలో గుజరాత్‌ (15), రాజస్థాన్‌ (15), ఛత్తీస్‌ఘడ్‌ (11), ఝార్ఖండ్ (11), ఉత్తరాఖండ్ (3), హిమాచల్ ప్రదేశ్ (2), అస్సాం (11), జమ్ము కాశ్మీర్ (2), ఢిల్లీ (5), గోవా (1), త్రిపుర (1), కేరళ (11), తెలంగాణ (9), కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ అండ్ నికోబార్ (1), డామన్ అండ్ డీయూ (1) కలిపి మొత్తం 195 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది.

ADVERTISEMENT

కానీ ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ లేదు. కారణం అందరికీ తెలుసు. ఏపీలో టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలా వద్దా?అని ఊగిసలాడుతుండటమే. బీజేపీ నిర్ణయం గురించే టిడిపి, జనసేనలు కూడా ఎదురుచూస్తూ, 58 శాసనసభ స్థానాలకు, లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించలేదు.

బీజేపీ జాతీయ సహ కార్యదర్శి శివప్రసాద్ ప్రస్తుతం ఏపీలో బీజేపీ నేతలతో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా భేటీ అవుతూ టిడిపి, జనసేనలతో పొత్తులు, ఏపీలో బీజేపీ, వైసీపి, టిడిపి, జనసేనల బలాబలాలు గురించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.

విష్ణుకుమార్ రాజు వంటి కొంతమంది సీనియర్లు టిడిపి, జనసేనలతో కలిసి పోటీ చేస్తే 2014లో బీజేపీ లాభపడిందని గుర్తు చేసి, ఈసారి వాటితో కలిసి సాగడమే మంచిదని సూచించిన్నట్లు తెలుస్తోంది. కానీ సీట్ల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని, బీజేపికి కనీసం 6-7 ఎంపీ, 15-20 ఎమ్మెల్యే సీట్లు తీసుకోవాలని వారు చెప్పిన్నట్లు తెలుస్తోంది.

కానీ ఈసారి బీజేపీలో లోక్‌సభకు పోటీ చేయాలనుకొంటున్నవారి సంఖ్య 75 మందికి పైనే ఉంది. వారందరూ సొంత బలంతో గెలవగలమని కనుక ఒంటరిగా పోటీ చేయడమే మంచిదని సూచించిన్నట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తేనే ఎప్పటికైనా సొంత కాళ్లపై నిలద్రొక్కుకోగలదని వారు గట్టిగా చెప్పిన్నట్లు తెలుస్తోంది.

కనుక ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలను బట్టి టిడిపి, జనసేనలతో కలిసి పోటీ చేయాలా వద్దా?ఒకవేళ కలిసి పోటీ చేయాలనుకుంటే ఎన్ని శాసనసభ, లోక్‌సభ సీట్లు తీసుకోవాలి?ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో బీజేపీ లాభపడుతుందా, నష్టపోతుందా?వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొన్న తర్వాత ఏపీలో బీజేపీ అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకుంది. బహుశః మరో వారం రోజులలోగా ఏపీలో బీజేపీ వైఖరిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories