
చంద్రబాబు అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్నప్పుడు ఎవ్వరు ఊహించని పరిస్థితులలో టీడీపీ తో పొత్తు ప్రకటన చేసారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఈ ఇద్దరి కూటమికి మోడీ – షాల ఆశీస్సులు ఉండాలని ప్రయత్నిస్తున్న పవన్ కు ఇప్పటికి ఒక క్లారిటీ ఇవ్వలేదు బీజేపీ అధిష్టానం.
మొన్న చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో పొత్తు విషయమై చర్చలు జరిపినప్పటికీ ఇంతవరకు అటు బీజేపీ నుంచి కానీ ఇటు టీడీపీ నుంచి కానీ ఒక నిర్దిష్టమైన ప్రకటన విడుదల కాలేదు. పవన్ కూడా ఢిల్లీ వెళ్ళి ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను వివరించి కేంద్ర పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నా అవి ఎప్పటికప్పుడు బెడిసి కొడుతూనే వస్తున్నాయి.
బీజేపీ తో పొత్తు విషయం తేలాక అటు టీడీపీ – జనసేన కూడా తమ పార్టీ తరుపున పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలో కానీ, పోటీ చేసే స్థానాల విషయంలో కానీ ఒక తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇవాళ, రేపు అంటూ నాన్చుడు ధోరణితో అటు పార్టీ నాయకుల, కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తున్నాయి టీడీపీ, జనసేనలు. దీని వలన రాష్ట్రంలో బీజేపీ కి కలిగే నష్టం అంటూ ఏమి ఉండదు.
ఇదిలా ఉంటే.., చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన వెంటనే ప్రజలతోనే మా పార్టీ పొత్తు అంటూ భీరాలు పోయే ముఖ్యమంత్రి జగన్ హుటాహుటిన రాని ప్రత్యేక హోదా, పూర్తి చేయలేని పోలవరం కోసం అంటూ కుంటి సాకులు చెప్పుకుంటూ ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కారు. అక్కడ జగన్ ఏం ఆఫర్ ఇచ్చారో…బీజేపీ ఏం కండిషన్స్ పెట్టిందో కానీ సిద్ధం అంటూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు తో పాటుగా మీడియా వారి మీద కూడా దాడులకు సిద్ధం అంటూ తన అధికార అహం చూపిస్తున్నారు జగన్.
ఏంజరిగిన చూసుకోవడానికి వెనుక ఒక పెద్ద దిక్కు ఉంది అనే నమ్మకంతో జగన్ ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారా అనే సందేహం లేకపోలేదు.అయితే షర్మిల చెప్పినట్లుగానే ఏపీలో ఏ పార్టీ గెలిచిన బీజేపీ ని కాదని ముందుకెళ్లే పరిస్థితి లేదు అనేది ఒప్పుకోవాల్సిన నిజం. ఇది అటు బీజేపీ అధిష్టానానికి తెలిసిన విషయమే. అయినప్పటికీ ఇలా పొత్తు విషయమై నాన్చుడు ధోరణి కొనసాగిస్తుంది అంటే అటు ఇన్నాళ్లు తెర వెనుక మద్దతిచ్చిన మిత్ర పక్షాన్ని వదులుకోలేక పోతుందా అనే అనుమనాలు కలుగుతున్నాయి.
అందులో భాగంగానే బీజేపీ పొత్తు విషయమై ఎటు తేల్చక టీడీపీ – జనసేన పార్టీలను అడుగు ముందు వేయనీయకుండా ఆపి అటు వైసీపీకి తన సహకారాన్ని అందిస్తుందా.? ఇటు బీజేపీ ని నమ్ముకుని ఇంతవరకు టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించలేదు, రాష్ట్ర స్థాయి పర్యటనలు చేపట్టలేదు, ఉమ్మడి కార్యాచరణ అంటూ కాలం వెళ్లబుచ్చుతూ వారి అంగీకారం కోసం ఎదురుచూపులు చూస్తూ సమయాన్ని వృధా చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు.
దీన్ని ఆసరాగా చేసుకుని ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తూ దూసుకు పోతున్నారు ముఖ్యమంత్రి జగన్. ఎన్నికల చివరి వరకు ఇలా టీడీపీ – జనసేన ను కట్టడి చేస్తూ చివరి నిముషంలో ‘సారీ, ఐ యామ్ నాట్ విత్ యూ’ అంటూ కమలనాధులు హ్యాండ్ ఇస్తే ఇక టీడీపీ, జనసేన పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోవాలి. తనకు ఏ మాత్రం బలం లేని రాష్ట్రంలో రాజకీయ నాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని బీజేపీ పన్నుతున్న ఈ పద్మ వ్యూహంలో చివరకు బలిపీఠం ఎక్కేది రాష్ట్ర ప్రజలా..?రాజకీయ పార్టీలా..?
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…