శ్రీకాంత్ అడ్డాల – ప్రిన్స్ మహేష్ బాబుల “బ్రహ్మోత్సవం” ఆడియో విడుదలై శ్రోతలను ఆకట్టుకుంటోంది. టైటిల్ సాంగ్ హైలైట్ గా నిలిచిన ఈ ఆల్బమ్ లో సూపర్ స్టార్ బెస్ట్ డ్యాన్సింగ్ పాటను చూడవచ్చు అంటోంది ‘కుందనపు బొమ్మ’ సమంత. ‘బాలత్రిపురమణి’ పాట తనకు బాగా నచ్చేసిందని… పాట చూసిన తర్వాత మీకు మరింత తెలుస్తుందని… తన బెస్ట్ ను సూపర్ స్టార్ అందించారని… సమంత చెప్పుకొచ్చింది.
నిజానికి, మహేష్ – కాజల్ ల మధ్య చిత్రీకరించిన ఈ పాట టీజర్ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేయగా, తాజాగా సినిమా హీరోయిన్ సమంత కూడా చెప్పడంతో అంచనాలు ఈ పాట విజువల్ పై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తన నటించిన పాట గురించి కాకుండా, సహచర హీరోయిన్ గురించి సమంత ప్రశంసలు కురిపించడం… నిజంగా ఆ పాట అంతలా నచ్చిందా..? లేక ప్రిన్స్ అభిమానులను బుట్టలో వేసుకోవడానికా?
ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన పని లేని ‘1 నేనొక్కడినే’ సినిమా పోస్టర్ పై సమంత చేసిన రగడతో ప్రిన్స్ అభిమానులు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారు. సమంత చేసిన రచ్చ నుండి మొదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా విఫలం చెందడంతో వారి ఆగ్రహం మరింత రెట్టింపయ్యింది. దీంతో వారిని శాంతింపచేయడానికి సమంత చేస్తున్న ప్రయత్నమా? లేక నిజంగానే మహేష్ తన బెస్ట్ అందించాడా? అన్నది సినిమా విడుదల తర్వాత మాత్రమే తెలిసే విషయం.



