
జాతీయ రాజకీయాలను శాసించాలనుకున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ఏకాకిగా మిగిలిపోయారు. కారణాలు అందరికీ తెలుసు. తెలంగాణలో అవసరార్ధం మునుగోడు ఉపఎన్నికలలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, శాసనసభ ఎన్నికలలో వాటిని పక్కన పడేసి కేసీఆర్ షాక్ ఇచ్చారు. కేసీఆర్ మొదటి నుంచి మజ్లీస్ పార్టీతో దోస్తీ కొనసాగిస్తున్నప్పటికీ, దాంతో పొత్తు పెట్టుకోనందున తెలంగాణలో కూడా కేసీఆర్ ఒంటరిగా మిగిలిపోయారు.
ఇంతకాలం ఆయన ఎదురులేకుండా తెలంగాణను పాలిస్తున్నప్పుడు ‘ఒంటరితనం’ లోటుగా కనిపించలేదు. కానీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ లోటు కొట్టవచ్చిన్నట్లు కనబడుతోంది. బిఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ కారణంగా బిఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంటే మరో వైపు లోక్‌సభ ఎన్నికలు ముంచుకు వచ్చేస్తున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అవినీతి భాగోతాలను తవ్వి తీస్తుండటంతో బీజేపీతో చేతులు కలపాలని ప్రయత్నించినా మోడీ, అమిత్ షాలు స్పందించడం లేదు. ఇటువంటి గడ్డు పరిస్థితులలో ఆకస్మికంగా కేసీఆర్‌కు తెలంగాణలోనే ఓ కొత్త స్నేహితుడు దొరికాడు. అతను మరెవరో కాదు… కేసీఆర్ ప్రభుత్వంలోనే ఐపిఎస్ అధికారిగా పనిచేసిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.
గతంలో ఆయన కేసీఆర్ నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తూ, ఉద్యోగానికి రాజీనామా బీఎస్పీలో చేరారు. కేసీఆర్‌ని గద్దె దించుతానని శపధాలు చేశారు. ఏనుగు (బీఎస్పీ చిహ్నం)తో గేట్లు, గోడలు బద్దలు కొట్టుకొని ప్రగతి భవన్‌లోకి ప్రవేశించి దళితులు రాజ్యాధికారం సాధిద్దామని గట్టిగా వాదించారు.
కేసీఆర్ కుటుంబ, రాచరిక, నియంతృత్వ పాలనకు తానే ముగింపు పలుకుతానని ప్రవీణ్ కుమార్ శపధాలు చేశారు. ఇన్ని శపధాలు, ప్రగల్భాలు పలికిన ఆయనతో సహా శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్ధులు ఎవరూ కూడా కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ఆయనకి కూడా మూడు నెలలు పట్టింది.
ఇప్పుడు ఆయన కేసీఆర్‌లో లౌకికవాదిని చూశారు. తెలంగాణలో నిసహాయంగా, ఏకాకిగా మిగిలిపోయిన కేసీఆర్‌కి కూడా ఆయన గొప్ప మిత్రుడుగా కనిపించారు. కనుక బిఆర్ఎస్, బీఎస్పీ పొత్తులు ఖాయం చేసుకున్నారు.
బీజేపీ నుంచి దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవావాలంటే కేసీఆర్‌తో చేతులు కలపడం చాలా అవసరమని ప్రవీణ్ కుమార్ చెప్పగా, బీఎస్పీ వంటి జాతీయ పార్టీతో పొత్తు కుదరడం చాలా సంతోషం కలిగిస్తోందని కేసీఆర్ చెప్పారు.
బిఆర్ఎస్ పార్టీతో పొత్తు వలన బీఎస్పీకి ఒకటి రెండు లోక్‌సభ సీట్లు దక్కవచ్చు. ఆ పార్టీ మద్దతుతో గెలుచుకోగలిగితే బీఎస్పీ లాభపడుతుంది. అదేవిదంగా ఒంటరిగా మిగిలిపోయిన తమకు దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్పీ తోడయితే, రాష్ట్ర రాజకీయాలలో మళ్ళీ చక్రం తిప్పేందుకు కేసీఆర్‌కి అవకాశం లభిస్తుంది.
కానీ బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటే, కేసీఆర్ తమని గుర్తుంచుకుంటారా లేక వామపక్షాలను తీసి పక్కన పడేసిన్నట్లు పడేస్తారా?అని బీఎస్పీ నేతలు ఆలోచించుకోవడం చాలా అవసరం.
The upcoming local body elections in Andhra Pradesh are putting political families back in the…
Sai Durgha Tej, filmmaker Teja Kakumanu and producer Anil Sunkara are joining hands for #SDT19.…