
ఏపీలో ‘విశ్వసనీయతకి పేటెంట్ రైట్స్’ వైసీపికి, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నాయని ఆ పార్టీల నేతలు చెప్పుకొంటారు. కనుక ఆ రెండు పార్టీలు తమ విశ్వసనీయతను కాపాడుకొంటాయని ఆశించడం తప్పు కాదు.
అయితే తెలంగాణ సిఎం కేసీఆర్ ఇదివరకు మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులతో రాసుకు పూసుకు తిరుగుతుండేవారు. దాని వలన తెలంగాణ బీజేపీ విశ్వసనీయత దెబ్బతింది. ఆ కారణంగానే బిఆర్ఎస్ విశ్వసనీయత కూడా ప్రశ్నార్ధకంగా మారుతుందని కేసీఆర్‌కు తెలియదనుకోలేము. కానీ ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. కనుక నష్టపోతే బీజేపీ పోతుంది తప్ప బిఆర్ఎస్ పార్టీకి ఏమీకాదని అనుకొన్నారు.
కానీ ఆయన ఊహించని విదంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకొని, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని, అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయడం లేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఈ రెండు పార్టీలతో పాటు మజ్లీస్ పార్టీకి కూడా మంచి అవగాహన ఉంది కనుకనే లిక్కర్ స్కామ్ గురించి ఓవైసీలు ఎన్నడూ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇంతకాలం బీజేపీ విశ్వసనీయత మాత్రమే దెబ్బ తినేది. కానీ కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణలతో బిఆర్ఎస్ విశ్వసనీయత కూడా ప్రశ్నార్ధకంగా మారింది.
దీంతో బిఆర్ఎస్, బీజేపీలు తాము బద్ద రాజకీయ శత్రువులని నిరూపించుకొనేందుకు కత్తులు దూసుకొంటున్నాయి. అలాగే మజ్లీస్ కూడా బీజేపీని తాను శత్రువుగా భావిస్తున్నామని ప్రజలకు తెలియజేసేందుకు మోడీపై విమర్శలు గుప్పిస్తోంది. అంటే విశ్వసనీయత దెబ్బ తింటే రాజకీయంగా నష్టపోతామని మూడు పార్టీలు గ్రహించిన్నట్లే ఉన్నాయి.
ఏపీ విషయానికి వస్తే వైసీపి, బీజేపీలు మళ్ళీ అదే తప్పు చేస్తుండటం విస్మయం కలిగిస్తుంది. పొత్తులు ఉన్న జనసేనని బీజేపీ అధిష్టానం పట్టించుకోవడం లేదు కానీ పొత్తులు లేని వైసీపికి అన్ని విదాలా సహకరిస్తోంది. వైసీపి కూడా కేంద్రానికి అన్ని విదాలా సహకరిస్తూనే ఉంది. కానీ తమ మద్య ఎటువంటి రహస్య అవగాహన లేదని రెండు పార్టీలు చెప్పుకొంటున్నాయి.
ఇప్పుడు అవి ఎలా ప్రవర్తించినా నష్టం ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఈ ప్రభావం చాలా ఉంటుందని తెలంగాణలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల పరిస్థితి చూస్తే అర్దమవుతుంది. కనుక ఏ రాజకీయ పార్టీకైనా విశ్వసనీయత ‘పేటెంట్ రైట్స్’ కలిగి ఉండటం కంటే ‘ప్రజలలో విశ్వసనీయత కలిగి ఉండటం’ చాలా ముఖ్యమని గ్రహిస్తే మంచిది.
Ranabaali First Half: It takes time to get used to VD in this role, and…
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…