
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో ఓటమిని నేటికీ బిఆర్ఎస్ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆర్నెల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని బెదిరిస్తున్నారనుకోవచ్చు.
కానీ ఎన్నికలలో ఓటమి తర్వాత కేసీఆర్ తుంటి ఎముక విరిగి రెండు నెలలు ఇంటికే పరిమితం కావడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బాగా కలిసివచ్చిందనే చెప్పాలి. ఆ రెండు నెలల్లో రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించ గలిగారు.
పనిలో పనిగా పదేళ్ళ కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్ధిక పరిస్థితి, ప్రాజెక్టుల పేరుతో ఎంత అవినీతి జరిగిందో ప్రజలకు చెప్పుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి జనాధరణ మరింత పెరిగేందుకు ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు.
ఆరు గ్యారెంటీ పధకాలను అమలుచేయాలంటూ ఒత్తిడి పెంచుతున్న బిఆర్ఎస్ పార్టీని ‘రౌండప్ చేసేందుకు’ తగిన సాక్ష్యాధారాలు సేకరిస్తూ తమతో పెట్టుకోవద్దని గట్టిగా చెప్పగలుగుతున్నారు. కనుక రేవంత్ ప్రభుత్వానికి బిఆర్ఎస్ పార్టీ తరపున బహుమతిగా ఈ రెండు నెలల ‘బఫర్ టైమ్’ లభించిందని చెప్పవచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి వస్తే బిఆర్ఎస్ పార్టీని తుడిచిపెట్టేస్తామని సిఎం రేవంత్ రెడ్డి గట్టిగానే హెచ్చరిస్తున్నారు. తమవి కేవలం ‘తాటాకు చప్పుళ్ళు’ కావని తెలియజేస్తున్నట్లు, ఈరోజు ఢిల్లీలో బిఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ బి.వెంకటేష్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకుని సిఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు పెద్ద షాక్ కూడా ఇచ్చారు.
ఇంతకాలం తెలంగాణలో, ఆ మాటకొస్తే యావత్ దేశంలోనే కేసీఆర్ వంటి గొప్ప రాజకీయ నాయకుడు లేడని, అపర చాణక్యుడు వంటి కేసీఆర్‌ని గద్దె దించడం కాదు కదా… కనీసం ఆయన దరిదాపులకి కూడా ఎవరూ వెళ్ళలేరంటూ బిఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకునేవారు. కానీ రేవంత్ రెడ్డి అలా ప్రగల్భాలు పలకకపోయినా తమలో తాము కుమ్ములాడుకుంటున్న కాంగ్రెస్ నేతలందరితోనే కేసీఆర్‌ని ఢీకొని ఓడించి, ముఖ్యమంత్రి పదవి చేపట్టి తాను కేసీఆర్ కంటే ఘనుడనని నిరూపించి చూపారు!
కనుక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలద్రోసి కేసీఆర్‌మళ్ళీ అధికారంలోకి వస్తారా లేక రేవంత్ రెడ్డే బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేసి, కేసీఆర్‌ని ఫామ్‌హౌస్‌కే పరిమితం చేస్తారా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
లోక్‌సభ ఎన్నికలలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరిలో ఎవరి సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకునే అవకాశం లభించింది. అందుకే లోక్‌సభ ఎన్నికలను ఇద్దరూ సవాలుగా తీసుకుని ‘పని’ మొదలుపెట్టారు. ముందుగా పెద్దపల్లి బిఆర్ఎస్ ఎంపీ బి.వెంకటేష్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించడంతో ఆ ‘పని’ మొదలైన్నట్లే. కనుక కేసీఆర్ కూడా ‘పని’ మొదలుపెట్టక తప్పదు. కేసీఆర్ ‘పని’ మొదలుపెడితే రేవంత్ రెడ్డి కూడా చేతులు ముడుచుకుని కూర్చోరు. కనుక వేసవి ఎండలు మొదలవక మునుపే తెలంగాణ రాజకీయాలు మళ్ళీ వేడెక్కవచ్చు.
The teaser of Jo Jo, titled Caution 1, introduces a group of hopefuls drawn to…
The latest trend in Tollywood is hard to miss. For the past year, whenever a…