
బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ తదితరుల నోటికి అడ్డూ అదుపు లేన్నట్లు మాట్లాడేవారు. ఆనాడు జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెడితే, హైదరాబాద్లో ఐటి ఉద్యోగులు హైటెక్ సిటీ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
అప్పుడు ఐటి మంత్రిగా ఉన్న కేటీఆర్, “మీ ఆంధ్రా పంచాయితీలు ఇక్కడ పెట్టొద్దు. ఏమైనా ఉంటే వెళ్ళి ఏపీలో ధర్నాలు చేసుకోండి. ఇక్కడ ధర్నాలు, ఆందోళనలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోము,” అని హెచ్చరించారు. పోలీసులు కూడా పాలకుల మనసెరిగి నడుచుకోవాలి కనుక హైదరాబాద్లో ఐటి ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించకుండా అడ్డుకున్నారు.
అయితే ఆరోజు తాము మాట్లాడిన మాటలు మళ్ళీ తమకే వర్తింపజేస్తారని కేసీఆర్, కేటీఆర్ కలలో కూడా ఊహించి ఉండరు. ఇప్పుడు ఈడీ అధికారులు కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోతే, కేటీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్తో రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
వాటిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ, “ఆనాడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే ఏపీలో పంచాయితీ ఇక్కడ పెట్టొద్దని మీరే అన్నారుగా. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే దాంతో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఏం సంబంధం?
ఒకవేళ మీరు అవినీతికి పాల్పడలేదనుకుంటే వెళ్ళి ఢిల్లీలో ఆందోళనలు చేసుకోండి. అంతేకానీ… హైదరాబాద్లోనో తెలంగాణ రాష్ట్రంలోనో ఆందోళనలు చేసి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోము,” అని హెచ్చరించారు.
కల్వకుంట్ల కవితకు ఇలాంటి కష్టం వచ్చినందుకు బిఆర్ఎస్ పార్టీలో అందరూ బాధపడుతుంటే, ఇప్పుడు కాంగ్రెస్ నేతల ఈ పుల్లవిరుపు మాటలు భరించడం ఇంకా కష్టంగా ఉంటుంది కదా?
ఆనాడు చంద్రబాబు నాయుడుని జైల్లో పెడితే కేసీఆర్, కేటీఆర్ ఖండించలేదు. కనీసం స్పందించలేదు. కానీ తన కూతురు అవినీతి ఆరోపణలలో అరెస్ట్ అయితే తెలంగాణ ప్రజలందరూ సంఘీభావం తెలపాలని కోరుకొంటున్నారు. ఏదైనా తన దాకా వస్తే కానీ తెలియదంటే ఇదేనేమో?
కల్వకుంట్ల కవిత కేసు తాజా సమాచారం: ఈరోజు ఉదయం ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈడీ, కల్వకుంట్ల కవిత తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. భోజన విరామం తర్వాత మళ్ళీ ఈ కేసు విచారణ జరుగుతుంది. ఆమెకు బెయిల్ లభిస్తుందో లేదో విచారణ పూర్తయితే గానీ తెలియదు.
Mrunal Thakur has not signed a new film in nearly nine months. However, it is…
Mumbai Indians have reportedly shut down rumours of Rohit Sharma returning as captain for IPL…