
ఓటమి తరువాత పార్టీ విలీనమా.? రాష్ట్రానికి విమోచనమా.? అనే స్థాయికి వెళ్లిన బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వమే దగ్గరుండి ప్రాణం పోస్తుంది అనే అభిప్రాయం నానాటికి బలపడుతుంది.
ఒక్క ఓటమి దశాబ్దం పాటు కూడగట్టుకున్న బలాన్నంతా లాగేసుకుంటుందా అన్నట్టుగా పార్టీలో సీనియర్ నాయకులు ఒక్క్కొక్కరు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరుకోవడం బిఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బగా భావించారు.
అయితే పదేళ్ల అధికారాన్ని, పాతికేళ్ల రాజకీయ అనుభవాన్ని ఒక్క ఓటమి కుంగతీసిందే అన్న నైరాశ్యంలోకి బిఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. అలాగే ఒకపక్క ఓటమి భారం మరోపక్క కూతురు కవిత కేసు కేసీఆర్ నోటికి, కాలికి కళ్లెం వేసాయి.
దీనితో కేసీఆర్ రాజకీయ వేదికలకు, ప్రజా జీవితానికి దూరంగా ఫామ్ హౌస్ లో కాలం వెళ్లదీస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అటు బీజేపీలో విలీనం కాబోతుంది అంటూ కాంగ్రెస్ నేతలు, కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేయబోతున్నారు అంటూ బీజేపీ నాయకులు బిఆర్ఎస్ అస్తిత్వం మీద దెబ్బ కొట్టారు.
ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న హైడ్రా నిర్ణయం బిఆర్ఎస్ పార్టీకి ప్రాణం పోసినట్లయింది. హైడ్రాతో హైద్రాబాద్ లోని అక్రమ కట్టడాల కూల్చివేతలు ఆదేశాలిచ్చింది రేవంత్ సర్కార్.
దీనితో ఒక్కసారిగా ప్రజలలో తీవ్ర ఆందోళన మొదలయ్యింది. దానికి తగ్గట్టే కళ్ళ ముందే తమ కలలసౌధాన్ని హైడ్రా కూల్చివేస్తుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఆందోళన బాటపట్టారు హైడ్రా బాధితులు. అయితే తమ ఆందోళనకు రాజకీయ బలం చేర్చుకోవడానికి సదరు బాధిత కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంకు ‘క్యూ’ కడుతున్నారు.
హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వమే బిఆర్ఎస్ పార్టీకి ఒక అస్త్రాన్ని అందించింది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానికి తోడు తాజాగా మంత్రి కొండా సురేఖ సమంత, నాగార్జున కుటుంబాల మీద చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బూమరాంగ్ గా మారాయి.
దీనితో సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రి వ్యాఖ్యల పై మండిపడ్డారు. అలాగే ఇటు సోషల్ మీడియాలో కూడా సురేఖ వ్యాఖ్యల మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక మహిళ అయ్యి ఉండి మరో మహిళ ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా నిరాధారమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ సురేఖ వ్యాఖ్యల పై పెద్ద ఎత్తున నిరశన వ్యక్తమవుతోంది.
ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే వెంటిలేటర్ మీద ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీకి ఒక్కో అస్త్రాన్ని అందిస్తూ జీవం పోస్తుంది అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ గట్టిగా వినపడుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ అందించిన అస్త్రాలతోనే బిఆర్ఎస్…కాంగ్రెస్ ప్రభుత్వం మీదే యుద్ధం చేసి లక్ష్యాన్ని అందుకోగలుగుతుందా.?
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…