
శాసనసభ ఎన్నికల్లో చాలా ప్రత్యేకమైనవి ఢిల్లీ శాసనసభ ఎన్నికలు. ఎందువల్ల అంటే.. ఢిల్లీ నుంచి దేశాన్ని పాలిస్తూ, ఒక్కో రాష్ట్రాన్ని జయిస్తూ దూసుకుపోతున్న బీజేపికి, తన పక్కనే ఢిల్లీలోనే ఉన్న ఆమాద్మీ పార్టీ, దాని అధినేత అరవింద్ కేజ్రీవాల్ కొరకరాని కొయ్యలా మారారు.
గత 10 ఏళ్ళుగా ఆమాద్మీ పార్టీని ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపి అధిష్టానం చేయని ప్రయత్నం లేదు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టిస్తూనే ఉంది.
మొదట ఢిల్లీకే పరిమితమైన ఆమాద్మీ పార్టీ ఇప్పుడు పంజాబ్‌లో కూడా గెలిచి అధికారంలోకి వచ్చింది. చివరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది కూడా. కానీ బీజేపి వేసిన ప్రతీ ఎత్తుకి అరవింద్ కేజ్రీవాల్ పైఎత్తు వేస్తూనే ఉన్నారు.
ఆ కేసులో అరెస్ట్ అవగానే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారనుకుంటే చేయకుండా జైల్లో నుంచి ప్రభుత్వాన్ని నడిపించారు. కానీ బెయిల్‌పై బయటకు రాగానే మొట్టమొదట తన పదవికి రాజీనామా చేశారు!
తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ఢిల్లీ ప్రజలు భావించి మళ్ళీ గెలిపిస్తేనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని శపధం చేసి ఆ కుర్చీలో మహిళా మంత్రి అతిశీని కూర్చోబెట్టి అప్పటి నుంచి ప్రజల మద్య తిరుగుతున్నారు.
తద్వారా మోడీ ప్రభుత్వం ఆ మహిళా ముఖ్యమంత్రి జోలికి వెళ్ళేందుకు సాహసించకుండా చేశారు. ఎందుకైనా మంచిదని ఆమెను కూడా మోడీ ప్రభుత్వం ఏదో వంకతో అరెస్ట్ చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ పదేపదే మీడియాకు చెపుతూ కేంద్రం అటువంటి ఆలోచన చేయకుండా తెలివిగా కట్టడి చేశారు.
లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని నిరూపించి ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని బీజేపి అధిష్టానం భావిస్తే, ఆయనే పదవికి రాజీనామా చేసి బీజేపిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుండటం బీజేపి పెద్దల ఊహకు అందని ఎత్తే.
ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల కమీషన్ నేడు ఢిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. నోటిఫికేషన్: జనవరి 10. ఆరోజు నుంచే నామినేషన్స్ దాఖలు. ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడుతాయి.
కనుక ఈసారి ఎలాగైనా ఆమాద్మీ పార్టీని, అరవింద్ కేజ్రీవాల్‌ని ఓడించడం బీజేపికి చాలా అవసరం. మరోసారి గెలిస్తే ఇక ఎన్నటికీ ఆయనని ఓడించడం, ఇతర రాష్ట్రాలకు ఆమాద్మీ పార్టీ విస్తరించకుండా అడ్డుకోవడం బీజేపి వల్ల కాదు. అలాగే ఆయనకు కూడా ఈ ఎన్నికలలో మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అవడం చాలా ముఖ్యం. లేకుంటే ఢిల్లీలో ఆమాద్మీ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది. కనుక ఢిల్లీ శాసనసభ ఎన్నికలు చాలా స్పెషల్!
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…