
కేసీఆర్ ను కాదని బిఆర్ఎస్ ను వదులుకుని కవిత తెలంగాణ రాజకీయాలలో ఒంటరి పోరాటం చెయ్యగలదా.? ఒక వేళ ఆలా చేసి అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలదా.? కేసీఆర్ కు కొడుకు కేటీఆర్ అండగా ఉంటే మేనల్లుడు హరీష్ రావు బలంగా ఉన్నారు.
ఇక ప్రత్యేక రాష్ట్ర సాధన కర్త గా తెలంగాణలో కేసీఆర్ కు ఒక గులాబీ సైన్యమే ఉంది. దానికి తోడు ఎన్నో ఏళ్ళ రాజకీయ అనుభవం, ఎన్నో రాజకీయ ఎదురు దెబ్బలు తిన్న అలవాటు, అలాగే తిరిగి ప్రత్యర్థిని అంతే బలంగా కొట్టగలిగిన చరిత్ర కేసీఆర్ రాజకీయ పెట్టుబడిగా ఉంది.
వీటన్నింటిని తట్టుకుని కవిత తండ్రి ని కాదని, అన్న ను వద్దనుకుని, మామను నమ్మనని తెలంగాణలో రాజకీయం చెయ్యగలరా.? చేసి ఎదగగలరా.? ఇటు పక్క ysr రాజకీయ చరిష్మా జగన్ కు అనుకూల ఫలితాలను ఇవ్వగలిగింది కానీ షర్మిలకు మొండి చెయ్యే చూపించింది. దీనితో షర్మిల రాజకీయ ప్రయాణం అన్న పార్టీ నుంచి సొంత పార్టీ కి అక్కడి నుండి కాంగ్రెస్ గూటికి చేరి ఇప్పుడు గమ్యం లేని ప్రయాణం మాదిరి కొనసాగుతుంది.
షర్మిల కూడా రాజకీయ ప్రసంగాల పరంగా, ప్రత్యర్థి పై విమర్శల పరంగా జగన్ కంటే మంచి వక్త గానే నిరూపించుకున్నారు. తన విమర్శనా బాణాలతో ప్రత్యర్థుల పై విరుచుకుపడగలిగిన సత్తా షర్మిల సొంతం. అయినా జగన్ ను కాదని అడుగు ముందుకేసి షర్మిల చివరికి ఒంటరి ప్రయాణం చేస్తూ సొంత వారితోనే, సొంత మీడియాలోనే చివాట్లు తింటూ నిందలు మోస్తుంది.
షర్మిల రాజకీయ ప్రయాణాన్ని ఉదాహరణగా చూస్తున్న కవిత ఇప్పటికి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కేసీఆర్ ను కాదని అడుగు ముందుకేయాలని ఎందుకు భావిస్తున్నారు. కవిత రాజకీయంగా ఎదగడానికి కవితకు ఖచ్చితంగా ఒక పార్టీ స్నేహ హస్తం అవసరమవుతుంది. దాన్ని కవిత ఇప్పటికే సిద్ధం చేసుకున్నారా.? ఆ బలమే కేసీఆర్ ను ఎదిరించే శక్తిగా మారిందా.?
తెలంగాణలో అధికార పార్టీగా కాంగ్రెస్ ఉంటే ప్రతిపక్షంలో బిఆర్ఎస్ కొనసాగుతుంది. ఇక మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండగా, తీన్మార్ మల్లన్న బీసీ పార్టీ అంటూ ప్రకటించారు. ఇక కమ్యూనిస్టు పార్టీలు పేరుకే తప్ప అధికారానికి ఆవడ దూరం. MIM విషయానికొస్తే ఈ పార్టీ తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే వారి మిత్ర పక్షంగా మారిపోతుంది.
ఇక టీడీపీ, జనసేన విషయానికొస్తే ఈ రెండు పార్టీలలో జనసేన పేరుకే పార్టీ తప్ప ఇప్పటి వరకు తెలంగాణలో జనసేన ఖాతా తెరిచింది లేదు. టీడీపీ సంగతి చూస్తే ఈ పార్టీకి బలమున్న, ప్రజలు నుంచి మద్దతు దొరికినా పార్టీని నాయకత్వ లోపం ఎదగనివ్వడం లేదు, అలాగే తెలంగాణ సెంటిమెంట్ పసుపు సైకిల్ ను తెలంగాణ రాజకీయాలలో నిలబడనివ్వడం లేదు.
ఈ పార్టీలన్నిటిలో కవిత బిఆర్ఎస్ ను కాదనుకుంటే తనను అరెస్టు చేసి జైలుకు పంపిన బీజేపీ కి వెళ్ళలేదు, ఇన్నాళ్ళుగా తెలంగాణ ద్రోహి అంటూ ముద్ర వేసిన టీడీపీ వైపు రాలేదు, ఇక మిగిన పార్టీలు కేవలం ఉనికి కోసం నిలబడేవి తప్ప అధికారం కోసం పోరాటం చేసేవి కాదు.
కాబట్టి కవితకు కాంగ్రెస్ తప్ప మరో ఆప్షన్ ఉండక పోవచ్చు. ఇప్పటికి తన జాగృతి ఫౌండేషన్ ను ఎలర్ట్ చేసిన కవిత ఇక రానున్న రోజులలో జాగృతి ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు నడుం బిగిస్తారు. అయితే ఇప్పటికే కవిత చర్యలకు ప్రతి చర్యగా బిఆర్ఎస్ కవితను సింగరేణి నుండి దూరం పెట్టిన నేపథ్యంలో ఇక గులాబీ కారుకు సైతం కవితను దూరం చేసే సమయం, సందర్భం కోసం వేచి చూస్తున్నారు.
Nikita Sharma is turning up the tropical heat with her latest breathtaking beach photoshoot, proving…
After the back to back failures of Toxic and Hi, Nayanthara's next release will most…