
టీడీపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేశారు. అంతకు ముందు అయన వైసీపీ చేతిలో చాలా తీవ్రంగా వ్యక్తిత్వ హననానికి గురయ్యారు. కనుక అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ, బహుశః ప్రజలు కూడా అయనను తక్కువ అంచనా వేశారు.
కానీ ఆ పాదయాత్రతోనే నారా లోకేష్ తనని తాను ఆవిష్కరించుకోవడమే కాకుండా రాష్ట్రంలో టీడీపికి ప్రజల మద్దతు కూడగట్టగలిగారు. కూటమి ప్రభుత్వం విజయానికి యువగళం పాదయాత్ర కూడా ఎంతగానో దోహదపడింది.
అంతకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాదయాత్రలు చేసి పార్టీలను గెలిపించుకున్నారు. నారా లోకేష్ పాదయాత్రతో మరోసారి అది నిరూపితమైంది.
కనుక ఏపీలో మళ్ళీ జగన్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది మద్యలో పాదయాత్రలు చేస్తామని ప్రకటించారు. జగన్ ఇదివరకు ఓదార్పుయాత్రలు, పాదయాత్ర చేసిన అనుభవం ఉంది కనుక మరోసారి చేయడం పెద్ద కష్టం కాదు. కానీ కేటీఆర్ పాదయాత్ర చేయగలరా లేదా? అనేది మొదలుపెడితే కానీ తెలీదు.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో, ఆ తర్వాత కేసీఆర్ 5 ఏళ్ళ పాలన తర్వాత తెలంగాణలో రాజకీయ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉండేది. కానీ ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉంది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలు, అసమర్ధత, వైఫల్యాలే తమని గెలిపిస్తాయనే భ్రమలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది.
వాస్తవ దృష్టితో చూసినట్లయితే వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురీత తప్పదనిపిస్తుంది. కనుక కేటీఆర్ పాదయాత్ర చేయగలిగితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిలో ఏమైనా మార్పు రావచ్చు.
కార్పోరేట్ సమావేశాలను అలవోకగా హ్యాండిల్ చేయగల కేటీఆర్, ఎండావాన, దుమ్ము దూళి తట్టుకుంటూ పాదయాత్ర చేయగలరా?
ముఖ్యంగా తండ్రి కేసీఆర్ దాదాపు రాజకీయ అస్త్ర సన్యాసం చేసి పార్టీని ముందుండి నడిపించలేని పరిస్థితిలో ఉన్నందున కేటీఆర్ పార్టీని కాపాడుకుంటూ, ప్రత్యర్ధులను ధీటుగా ఎదుర్కొంటూ, ప్రజలతో మమేకం అవుతూ వాతావరణంలో మార్పులను అన్నిటినీ తట్టుకుని పాదయాత్ర చేయగలరో లేదో… మొదలుపెడితే తెలుస్తుంది. చేయగలిగితే సత్ఫలితాలు ఆశించవచ్చు. దీనినే మరోలా చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం రావాలంటే కేటీఆర్ పాదయాత్ర చేయక తప్పదు. మరి చేస్తారో లేదో? చేయగలరో లేదో?
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…