అవినీతి కేసుల విచారణకు ప్రతీ శుక్రవారం కోర్టుకి హాజరు కావడం నుండి మినహాయింపు కోరిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ కోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో అధికార పార్టీ నేతలు, అనుయాయులు ఢీలా పడిపోయారు. ఈ కేసులో సిబిఐ వాదనలతో కోర్టు ఏకీభవించినట్టుగా అయ్యింది.
జగన్ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని, అందుకే అప్పుడు ఆయనను అరెస్టు చేయడం జరిగిందని, అలాంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, అధికారులంతా ఆయన చెప్పినట్లు వినాల్సి ఉంటుందని.. ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.
ఇదే సందర్భంగా జగన్ కేసులలో నిందితులైన అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ సిబిఐ కోర్టుకు తెలిపిందట. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడానికి చేసిన ప్రయత్నాన్ని, ఈ కేసులో ఉన్న ఇతర అధికారులు కూడా ఏపీలో ఆశ్రయం పొందడానికి చేసిన యత్నాలను కూడా సీబీఐ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చిందట.
అధికారుల వాంగ్మూలాలు ఈ కేసులో కీలకమని, వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పెద్ద పోస్టులు ఇచ్చి మచ్చిక చేసుకుని జగన్ ఈ కేసులను ప్రభావితం చేస్తున్నట్టుగా ఉందని సిబిఐ కోర్టుకు తెలిపిందట. ఇది ఇలా ఉండగా ఈ తీర్పు పై హైకోర్టుని ఆశ్రయిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అనే దానిపై ముఖ్యమంత్రి జగన్ సమాలోచనలు జరుపుతున్నారట.





