హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాసకు మద్దతు ఇస్తున్న సిపిఐ పరిస్థితి చిత్రంగా ఉంది. ఆ పార్టీకి చెందిన ట్రేడ్ యూనియన్ ఎఐటియుసి ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటోంది. ఆ కార్మిక నేతలు హుజుర్ నగర్ ఉపఎన్నికలో తెరాసకు ఇచ్చిన మద్దతును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
48,660 కార్మికుల ఉద్యోగాలు తీసి వెయ్యడంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కాని అందుకు సిపిఐ అందుకు సిద్దపడలేదు. పైగా ఆర్టీసీలో 50% ప్రైవేటు పరం చేస్తాం అని ముఖ్యమంత్రి డైరెక్టుగా చెప్పారు. ఇవన్నీ సిపిఐ మూలసూత్రాలకు వ్యతిరేకమే. అయితే సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ ప్రైవేటీకరిస్తారన్న భయం ఏర్పడిందని ఆయన అన్నారు. అయితే హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించుకుంటారా అని అడిగితే అది రాజకీయ నిర్ణయం అని తప్పుకునే ప్రయత్నం చేశారు. పార్టీ మూలసూత్రాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా ఎందుకు మద్దతు ఇస్తున్నారో వారికే తెలియాలి.
కమ్యూనిస్టులు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారా అనే విమర్శలకు వారు గట్టిగా సమాధానం చెప్పుకోగలరా? మరోవైపు మరో కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం ఈ ఎన్నికలో పోటీ చెయ్యాలనుకున్నా తమ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ కావడంతో పోటీలో లేదు. టీడీపీ వారి మద్దతు కోరినా ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.





