
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత మీద టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు 12 గంటల దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. జనసేనానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చెయ్యడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు.
“ప్రజల కోసం పోరాటం చేస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తారా? మీపై, మీ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోగలరా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. చేతనైతే ఇసుక ఉచిత సరఫరా చేయండి… లేదంటే మేం చేతగానివాళ్లమని ప్రజలకు చెప్పాలన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఎన్నికల్లో కోరారని.. ప్రజలు ఒకసారి అవకాశమిస్తే మరణశాసనం రాస్తున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు దీక్షకు జనసేన పార్టీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే ఇది వరకు జనసేన చేసిన లాంగ్ మార్చ్ కు టీడీపీ సంఘీభావం తెలిపింది. అప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి మద్దతు తెలపగా, ఇప్పుడు టీడీపీ నాయకులు జనసేన ఆఫీసుకు వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిశారు.
ఈ పరిణామాలతో రానున్న రోజులలో టీడీపీ, జనసేన కలిసి పని చెయ్యబోతున్నాయా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు అయితే రెండు పార్టీలు కలిసి రానున్న లోకల్ ఎన్నికలలో పోటీ చేస్తాయి అని కూడా అనడం మొదలు పెట్టాయి.





