
ఒక రాష్ట్రం లేదా రాష్ట్ర రాజధాని అభివృద్ధి కావాలంటే మరో రాష్ట్రం, దాని రాజధానిని దెబ్బతీయాల్సిన అవసరమే లేదు. కానీ ఉందనుకున్నారు కేసీఆర్.
అందుకే అమరావతి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఏపీని అభివృధ్దికి పూనుకున్న చంద్రబాబు నాయుడుని గద్దె దించేందుకు 2019 ఎన్నికలలో జగన్‌కు తోడ్పడ్డారు. ఆక్రమాస్తుల కేసులలోనే జగన్ ధోరణిని నిశితంగా గమనించిన కేసీఆర్, ఆయనను చంద్రబాబు నాయుడుపై, ఏపీ.. దాని రాజధాని అమరావతిపై పాశుపాతాస్త్రంగా ప్రయోగించి ఆశించిన ఫలితాలు సాధించారు.
అమరావతి రాజధానిగా వద్దని కోరుకుంటున్న జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు తోడ్పడి అమరావతిని, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా దెబ్బతినేలా చేశారు.
కేసీఆర్ ఓ దురాలోచనతో ఈ రాజకీయం చేస్తే, దాంతో తనకు ముఖ్యమంత్రి పదవి దక్కిందని జగన్ సంతోషిస్తూ ఇష్టారాజ్యం చేశారు.
అయితే ‘మన బంగారం మంచిది కాకపోతే…’ అన్నట్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపించాల్సిన జగన్, అన్నిటికీ రివర్స్ గేర్ వేసి, భ్రష్టు పట్టించేసినప్పుడు కేసీఆర్‌ని నిందించి ఏం ప్రయోజనం?అని ఏపీ ప్రజలు సరిపెట్టుకున్నారు.
ఏపీలో నెలకొన్న ఈ పరిస్థితులనే కేసీఆర్ తెలంగాణకి అనుకూలంగా మార్చుకొని అనేక భారీ పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు సాధించుకున్నారు. తెలంగాణని, రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేసుకున్నారు.
ఒకరి వినాశనం లేదా పతనాన్ని కోరుకునేవారు ఎన్నడూ బాగుపడరనేందుకు వారిద్దరే నిదర్శనాలుగా కనిపిస్తున్నారు. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే.
కానీ ఇప్పుడు ఏపీ, తెలంగాణల మద్య చాలా ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. ఇక్కడ సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి పునర్నిర్మాణానికి సన్నాహాలు చేస్తుంటే అక్కడ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ‘ఫ్యూచర్ సిటీ’కి శ్రీకారం చుట్టారు. అంటే పక్క రాష్ట్రాన్ని, రాజధానిని దెబ్బతీయకుండా ఈవిదంగా కూడా పోటీ పడవచ్చని రేవంత్ రెడ్డి నిరూపించి చూపుతున్నారన్న మాట!
జగన్‌కి కూడా తన సమర్దత నిరూపించుకునేందుకు ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆయన దాని విలువ గ్రహించలేక పోయారు అందుకే సద్వినియోగం చేసుకోలేకపోయారు కూడా.
కానీ చంద్రబాబు నాయుడుకి ‘ఒక్క ఛాన్స్ విలువ’ బాగా తెలుసు. అందుకే అమరావతి, పోలవరం, ఏపీ అభివృద్ధి అనే ఈ మూడు పనుల గురించి తప్ప వేరే ధ్యాస లేనట్లు పనిచేసుకుపోతున్నారు.
అక్కడ రేవంత్ రెడ్డి కూడా అమరావతి గురించి ఆలోచించకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అవసరమైతే పరస్పరం సహకరించుకుంటున్నారు కూడా. రాష్ట్రాలను, రాజధానులను ఈవిదంగా ఇటువంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో కూడా అభివృద్ధి చేసుకోవచ్చని ఇద్దరూ నిరూపించి చూపుతున్నారు.
Ranbir Kapoor, Yash and Sai Pallavi are starring in the upcoming adaptation of Ramayana, directed…
Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…