
సాధారణంగా లోక్‌సభ ఎన్నికలలో జాతీయ అంశాలు, శాసనసభ ఎన్నికలలో రాష్ట్రానికి సంబందించిన అంశాలు అజెండాగా ఉంటాయి.
ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు రెండూ ఒకే రోజు (మే 13) జరుగుతుండటంతో జాతీయ స్థాయి అంశాలపై ఏ పార్టీ కూడా పెద్దగా మాట్లాడటం లేదు.
ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలు ఎన్నికల ప్రచారానికి వస్తే బహుశః అప్పుడు జాతీయ అంశాలపై చర్చ జరుగవచ్చు.
అయితే ఏపీలో వైసీపి-టిడిపి, జనసేనల మద్య జరుగుతున్న రాజకీయ యుద్ధ ప్రభావమే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అందరికీ తెలుసు.
కనుక జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అజెండాను చాలా తెలివిగా హైజాక్ చేసి, తాను కోరుకొన్న అజెండాపై టిడిపి, జనసేన, బీజేపీలు మాట్లాడేలా చేయడంలో సఫలం అయ్యారని చెప్పవచ్చు. ప్రజాగళం సభలలో మూడు పార్టీల నాయకుల ప్రసంగాలను వింటే ఈవిషయం అర్దమవుతుంది. మూడు పార్టీల నేతలు జగన్‌ను తిట్టిపోయాడానికే పరిమితం అయ్యారంటే అది జగన్ చాతుర్యంగానే భావించాల్సి ఉంటుంది.
నిజానికి శాసనసభ ఎన్నికలలో అమరావతి రాజధాని, విశాఖ రాజధాని, ఋషికొండ ప్యాలస్, పోలవరం ప్రాజెక్టు, పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని అందరూ ఆశించారు.
వీటిపై చర్చ జరిగితే జగన్ జవాబులు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. కనుక ప్రతిపక్ష నేతలకు వాటి గురించి ఆలోచన కూడా కలగనీయకుండా మహాభారతంలో పిట్టకధల్లా ‘వాలంటీర్లు-పింఛన్ చెల్లింపులు’ వంటి అంశాలను హైలైట్ అయ్యేలా చేసి టిడిపి, జనసేనలు ఆ మాయలో పడి తిరుగుతుండేలా చేశారు.
చంద్రబాబు నాయుడు వంటి అపార రాజకీయ అనుభవజ్ఞుడు కూడా ఈ జగన్ సృష్టించిన ఈ సుడిగుండంలో చిక్కుకొని ప్రజలను ఆలోచింపజేసే అమరావతి తదితర ముఖ్యమైన అంశాల గురించి వైసీపిని గట్టిగా నిలదీయకుండా, జగన్ నిర్దేశిస్తున్న అజెండాలో పడి కొట్టుకుపోతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
అయితే జగన్ మాత్రం ‘మేమందరం సిద్దం’ సభలలో తన ఎన్నికల అజెండా అంటే సంక్షేమ పధకాల గురించి చక్కగా చెప్పుకొంటూ చేసిన మేలు మరిచిపోవద్దని ఓటర్లను చేజారిపోకుండా కాపాడుకొంటూనే ఉన్నారు. ఈవిదంగా జగన్ తన ఎన్నికల అజెండా ప్రకారం ముందుకు సాగుతుంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఆయన సృష్టించిన సుడిగుండంలో చిక్కుకొని గిరగిరా తిరుగుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఎన్ని తిట్లు తిట్టినా ఆయనకు సానుభూతి రూపంలో ఎంతో కొంత లాభమే కలుగుతుంది తప్ప వాటితో కొత్తగా వచ్చే నష్టం, అప్రదిష్ట ఏమీ ఉండదు.
అదే అమరావతి, విశాఖ రాజధాని, ఋషికొండ ప్యాలస్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, వలసలు తదితర అంశాలపై జగన్మోహన్ రెడ్డిని గట్టిగా నిలదీయగలిగితే వాటికి ఆయన జవాబు చెప్పుకోలేక వారిపై ఎదురుదాడి చేస్తారు. అప్పుడు ప్రజలు కూడా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తుచేసుకోకుండా ఉండరు. అప్పుడే ఓటర్ల తీర్పు మరింత స్పష్టంగా ఉంటుందని టిడిపి, జనసేనలు గ్రహిస్తే మంచిది.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…