
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తీరు, వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రధాని నరేంద్రమోడీ అంతటివాడినే అసమర్దుడు, చాతకానివాడంటూ చులకనగా మాట్లాడేవారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను ఎంత చులకనగా చూసేవారో పార్టీని వీడిన మాజీ మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటివారు కధకధలుగా చెపుతుంటారు.
ప్రతిపక్ష నేతలను చిల్లరగాళ్ళు అంటూ ఇంకా చులకనగా మాట్లాడేవారు. ఇవన్నీ అందరూ ఎప్పుడో అప్పుడు విన్నవే.
అయితే ఎన్నికలలో ఓటమి ఆయన మాట తీరులో కూడా మార్పు తెచ్చిన్నట్లుంది. గురువారం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో తొలిసారి సమావేశమైనప్పుడు, మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళి సిఎం రేవంత్ రెడ్డిని కలిసి రావడాన్ని ప్రస్తావిస్తూ, కేసీఆర్ వారిని చాలా సున్నితంగా మందలించారు.
ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి నియోజకవర్గం సమస్యల గురించి వినతి పత్రాలు ఇవ్వడం తప్పు కాదు కానీ ఇలా వారి కార్యాలయాలకు వెళ్ళి భేటీ అయితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, కనుక వారు ప్రజల మద్య ఉన్నప్పుడే వెళ్ళి కలవాలని కేసీఆర్ హితవు పలికారు.
కేసీఆర్ చెప్పింది అక్షరాల నిజమే. వారు సిఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వగానే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారంటూ మీడియాలో ఊహాగానాలు మొదలైపోయాయి.
బిఆర్ఎస్ పార్టీలోలోన ఏమి జరుగుంతోందనేది పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సిఎంని, మంత్రులతో భేటీ అయితే చివరికి జరిగేది ఫిరాయింపులే అని కేసీఆర్‌కు కూడా తెలుసు. కానీ కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో ఇంత మృధువుగా మాట్లాడి హితవు చెప్పడం విశేషమే.
అదే… ఆయన అధికారంలో ఉండి ఉంటే ఇంత మృధువుగా మాట్లాడేవారా? అంటే కాదనే తెలుసు. కానీ ఓటమి ప్రభావం, గట్టిగా మాట్లాడితే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వెళ్లిపోయే ప్రమాదం ఉందనే ఆలోచనతోనే కేసీఆర్ వారితో ఇంత మృధువుగా మాట్లాడిన్నట్లు భావించవచ్చు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడూ తన మంత్రులు, ఎమ్మెల్యేలతో ఇంత సఖ్యతగా వ్యవహరించి ఉండి ఉంటే నేడు ఈ దుస్థితి ఎదురయ్యేదే కాదు. అయితే కేసీఆర్ ఇకపై ఎప్పుడూ ఇలాగే అందరినీ కలుపుకుపోతారా? అంటే అది ఆయన నైజానికే విరుద్దం అని అందరికీ తెలుసు. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవు కనుకనే కాస్త మెతక వైఖరి పాటిస్తున్నారు… అంతే!
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…