తెలుగుదేశం పార్టీ హుజుర్ నగర్ ఉపఎన్నికలో పోటీ చెయ్యడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈరోజో రేపో పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం మొదలు పెడతారు. కాంగ్రెస్, తెరాస పార్టీలు ఇద్దరూ రెడ్డి అభ్యర్థిని పెట్టడంతో టీడీపీ బీసీ అభ్యర్థిని బరిలో దించాలని ప్రాధమికంగా అనుకున్నట్టు సమాచారం. అయితే ఇక్కడ పోటీ ఆ పార్టీకి అంత తేలిక కాదు.
చివరి సారిగా 2014లో ఇక్కడ పోటీ చేసింది టీడీపీ. అప్పుడు కాంగ్రెస్, తెరాస, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తరువాత నాలుగో స్థానంలో నిలిచింది. మహాకూటమిలో భాగంగా 2018 ఎన్నికల్లో ఈ సీటుని కాంగ్రెస్ కి విడిచిపెట్టింది. అంటే పది సంవత్సరాల తరువాత టీడీపీ ఇక్కడ నుండి పోటీ చేస్తుంది. ఇక్కడ ఆ పార్టీ ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.
అయితే ఇక్కడ పోటీ చెయ్యడానికి చంద్రబాబు దగ్గర వేరే కారణం ఉందట. 2019 సాధారణ ఎన్నికలలో చంద్రబాబు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చారు. నేరుగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వకపోయినా బీజేపీకి వ్యతిరేకంగా బలంగా స్టాండ్ తీసుకోవడంతో కాంగ్రెస్ కు మేలు చెయ్యడానికి ప్రయత్నించినట్టు అయ్యింది. దీని మోడీ – అమిత్ షా చంద్రబాబు మీద మరింత కక్ష పెంచుకున్నారు.
ఇప్పుడు టీడీపీ రెండు రాష్ట్రాలలోనూ ప్రతిపక్షంలో ఉంది. బీజేపీని వ్యతిరేకించి చేసేది ఏమీ లేదు. కక్షతో రగిలిపోయే మోడీ-షాలకు తాము ఇక నుండి కాంగ్రెస్ తో కలిసి పనిచెయ్యడం లేదు అనే మెస్సేజ్ పంపడానికి హుజుర్ నగర్ లో పోటీ ఉపయోగపడుతుందని చంద్రబాబు భావన. దీనితో తమపై కక్ష సాధింపు కొంత మేర అయినా తాగుతుందని చంద్రబాబు ఆలోచన కావొచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.





