
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలపై వైసీపి ప్రభుత్వం వరుసగా అనేక కేసులు నమోదు చేసి ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
అయితే ప్రతిపక్ష నేతలపై వైసీపి ప్రభుత్వమే కాదు… దానిపై ప్రతిపక్షాలు కూడా కేసులు వేయగలవని నిరూపిస్తూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏపీ, తెలంగాణ హైకోర్టులో ఒకేసారి రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేయగా, వైసీపి రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ కోర్టులో జగన్ మీద కేసు వేశారు.
ఏపీ హైకోర్టులో రఘురామ కృష్ణరాజు కేసు: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి,అవినీతికి పాల్పడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన బంధువులు, పార్టీలో ముఖ్య నేతలకు, కొన్ని ప్రైవేట్ సంస్థలకు వందల కోట్లు లబ్ధి కలిగేలా పాలసీలను రూపొందించి నిర్ణయాలు తీసుకొంటోందని రఘురామ కృష్ణరాజు తన ప్రజాహిత పిటిషన్‌లో పేర్కొన్నారు. వైసీపి ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు సంబందించి 8 పేజీల సాక్షాధారాలను హైకోర్టు సమర్పించారు. వైసీపి ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన ఏపీ హైకోర్టుని అభ్యర్ధించారు. అయితే ఈ కేసుని విచారించాల్సిన జస్టిస్ రఘునందనరావు ‘నాట్ బిఫోర్ మి’ ఆప్షన్ ఉపయోగించుకొంటూ ఈ కేసు విచారణను వేరే హైకోర్టులో బెంచికి బదిలీ చేశారు.
తెలంగాణ హైకోర్టులో హరిరామ జోగయ్య కేసు: జగన్, విజయ సాయిరెడ్డి తదితరులపై సీబీఐ కోర్టులో పదేళ్ళుగా అక్రమాస్తుల కేసుల విచారణ కొనసాగుతోందని, కానీ వాటిలో ఎటువంటి పురోగతి లేదని కనుక 2024 ఏపీ శాసనసభ ఎన్నికలలోగా వాటి విచారణ పూర్తిచేయాలని సీబీఐ కోర్టుని ఆదేశించాలని కోరుతూ హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత ప్రయోజన పిటిషన్ (పిల్) వేశారు. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు, నంబర్ కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి, సీబీఐ, సీబీఐ కోర్టులకు హైకోర్టు నోటీసులు పంపిచింది.
సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజు కేసు: కొన్ని రోజుల క్రితమే రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టులో కూడా ఓ పిటిషన్ వేశారు. జగన్ అక్రమస్తుల కేసుల విచారణ వేగవంతం చేయాలని సీబీఐని ఆదేశించవలసిందిగా కోరారు. దానిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి, వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి, ఇంకా ఈ కేసులతో సంబంధం ఉన్న పలువురిని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసి, ఈ కేసు తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.
దగ్గుబాటి పురందేశ్వరి లేఖ: అంతూ పొంతూ లేకుండా విచారణ సాగుతున్న అక్రమాస్తుల కేసులలో జగన్, విజయ సాయిరెడ్డి తదితరులకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆమె ఇటీవలే ఓ లేఖ వ్రాశారు.
ఇవన్నీ వారు కాలక్షేపం కోసమో లేదా మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించడానికో వేసిన కేసులనుకోలేము. జగన్, విజయ సాయిరెడ్డిల పట్ల కేంద్రప్రభుత్వం వైఖరిలో మార్పును సూచిస్తున్నట్లుగా భావించవచ్చు. కనుక ఈ కేసులన్నీ లేదా వీటిలో ఏదో ఒక దాంతో జగన్, విజయసాయిల మెడలకు ఉచ్చు బిగుసుకొనే అవకాశం కనిపిస్తోంది.
The wait is finally over! The makers of Ramayana, backed by producer Namit Malhotra, have…
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…