మెగాస్టార్ చిరంజీవి ‘బ్యాక్ విత్ ఎ బ్యాంగ్’ మాదిరి ‘మా సినీ అవార్డ్స్’లో వేసిన స్టెప్స్ కు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రత్యక్షంగా వీక్షించిన సినీ జనాలు సోషల్ మీడియా వేదికగా తమ అనుభూతులను, ఆనందాలను పంచుకుంటుండగా, ఈ అవార్డుల వేడుక బుల్లితెరపై ఎప్పుడు ప్రత్యక్షమవుతుందోనని మెగా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
నిజానికి చిరు డ్యాన్స్ ల విషయంలో గానీ, చిరు స్టామినా విషయంలో గానీ ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. కానీ, కొన్ని రోజుల పాటు ప్రాక్టీస్ చేసి మరీ మెగాస్టార్ గారు వేడుకపై సందడి చేసారు. అయితే, ఇలాంటి ఒక సాధారణ అవార్డుల వేడుకల్లో మెగాస్టార్ స్థాయి వ్యక్తి స్టెప్పులు వేయాల్సిన అవసరం లేదు. కానీ, ఎందుకు వేయాల్సి వచ్చిందో అన్న ప్రశ్నకు సమాధానంగా… ‘తనకు తానూ నిర్దేశించుకున్న ఒక టెస్ట్’ అని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.
రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన చిరు ప్రభావం ఏ మాత్రం కనపడకపోగా, ఇలాంటి పాత్రకు మెగాస్టార్ ఎందుకు వచ్చారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే మెగా ఎంట్రీ ఇచ్చే ముందు ప్రేక్షకుల నాడి తెలుసుకోవడానికి చిరు తనకు తానూగా పెట్టుకున్న పరీక్షగా ట్రేడ్ వర్గాలు చెప్పుకున్నాయి. తాజాగా ఒక టీవీ అవార్డుల వేడుకలో డ్యాన్స్ లు వేసింది కూడా అందుకేనన్న ప్రచారం జరుగుతోంది. ‘బ్రూస్ లీ’ విషయంలో పరాజయం పాలైనా, అవార్డుల వేడుకలో మాత్రం ‘బ్లాక్ బస్టర్’ టాక్ ను సొంతం చేసుకున్నారు.
దీంతో మెగా కాంపౌండ్ తో పాటు అభిమాన వర్గాల్లో కూడా పండగ వాతావరణం నెలకొంది. ఎంతమంది హీరోలు వచ్చినా… తమ మెగాస్టార్ కు తిరుగులేదంటూ… ఇక హీరోతో అయినా సమరమే… అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. నిజమే… దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత మెగా అభిమానుల్లో పూర్తి సంతృప్తి, నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహానికి కారణమయ్యారు మెగాస్టార్. మరికొద్ది రోజుల్లో ప్రతిష్టాత్మక సినిమా ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో ఇక మెగా అభిమానుల సందడికి శ్రీకారం చుట్టారు మెగాస్టార్.



