మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మరో రెండు రోజులలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాపై ఉయ్యాలవాడ వంశీకులు కేసులు వేసిన సంగతి తెలిసిందే. సైరా చిత్రీకరణ సమయంలో తమకు చిరంజీవి, చరణ్‌లు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని వారు ఆరోపణలు చేశారు. 22 కుటుంబాలకు 50 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారని చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే హైకోర్టు వరకూ వెళ్లినా వారికి అనుకూలమైన తీర్పు రాలేదు. ఈ క్రమంలో వేసిన కేసులన్నీ వెనక్కి తీసుకున్నారు.
చిరంజీవి చెప్పినట్లు తమ వంశీకులు ఒక్కొక్క కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు చెల్లించమని అడగలేదని, ఆయన అబద్ధం చెబుతున్నారని అన్నారు. అయితే చరణ్ ఇది వరకు చెప్పినట్లు తాము ఒక్కొక్క కుటుంబానికి రూ.15 లక్షలు అడిగామని తెలిపారు. అంటే దాదాపుగా 3.3 కోట్లు వారు అడుగుతున్నారు.
మరోవైపు సైరా టీం మాత్రం కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో ఇక వారికి ఏమీ ఇచ్చే అవకాశం లేదని, సినిమా సక్సెస్ అయితే మాత్రం ఉయ్యాలవాడ పుట్టిన గ్రామానికి ఏదైనా చెయ్యాలని చిరంజీవి అనుకుంటున్నారని అంటుంది. 200 కోట్ల పై మాటే ఈ సినిమా బడ్జెట్ అని నిర్మాతలు ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.





