ప్రస్తుతం సెట్స్ పై నున్న జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివల చిత్రం “జనతా గ్యారేజ్” సినిమాను ఆగష్టు 12వ తేదీన విడుదల చేయనున్నామని సినిమా ప్రారంభ రోజునే చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో సంబంధిత తేదీల సమయంలో మిగిలిన సినిమాలు ప్లాన్ చేసుకోకుండా ఉండడానికి నిర్మాణ సంస్థ ముందుగానే సంకేతాలు ఇచ్చింది.
దానికి తగిన విధంగానే సినిమా షెడ్యూల్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్, సారధి స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, ప్రస్తుతం చెన్నై చేరుకుని షూటింగ్ ప్రారంభించింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ కూడా నేడు చెన్నైలో జరుగుతున్న షూటింగ్ లొకేషన్స్ ను సందర్శించాడు. అంతా ప్రణాళిక పరంగా షూటింగ్స్ జరుగుతుండడంతో ఆగష్టు 12న ఖచ్చితంగా విడుదల అవుతుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అయితే ఇదే తేదీకి అక్కినేని నట వారసుడు నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ సినిమా విడుదల కాబోతుందని సమాచారం. ఇదే జరిగితే మరోసారి అక్కినేని హీరోతో జూనియర్ ఎన్టీఆర్ పోటీ పడడం ఈ ఏడాదిలోనే రెండవసారి అవుతుంది. సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’ విడుదలైన సమయంలో ‘కింగ్’ నాగార్జునతో పోటీపడ్డాడు ‘బుడ్డోడు.’ అయితే అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా కంటే అక్కినేని సినిమాకు ‘బ్లాక్ బస్టర్’ అంటూ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. దీంతో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ కు అక్కినేని హీరో తలనొప్పి తప్పేలా లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.



