
తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి సహకారం పొందుతూ తన లక్ష్యాన్ని సాధించారు. అయితే ఆ క్రెడిట్ ఆయన తనకే ఆపాదించుకొని ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత నుంచి ఆయన ఫక్తూ రాజకీయనాయకుడిగా మారిపోవడం చాలా ఆశ్చర్యకరమే. ఉద్యమాలలో కలిసి పనిచేసిన ప్రొఫెసర్ కోదండరామ్, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి అనేకమందిని తీసి పక్కన పడేసారు.
టిఆర్ఎస్‌కి రాష్ట్రంలో ఎదురే ఉండరాదని భావించి కాంగ్రెస్, టిడిపిలను పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. దానికి ఆయన పెట్టుకొన్న అందమైన పేరు బంగారి తెలంగాణ సాధన కోసం రాజకీయ పునరేకీకరణ.
భిన్న దృవాలైన మజ్లీస్, బిజెపిలతో ఒకేసారి స్నేహం చేయడం కేసీఆర్‌కు మాత్రమే చెల్లు. అయితే బిజెపి వలన తన అధికారానికి, పార్టీకి నష్టం కలుగుతుందని గ్రహించగానే ఏకంగా ప్రధాని నరేంద్రమోడీపైనే యుద్ధం ప్రకటించేశారు. కానీ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకోవడంతో కేంద్రంపై విమర్శలు తగ్గించేశారు.
బహుశః ఆందుకే కర్ణాటక శాసనసభ ఎన్నికలకు కూడా దూరంగా ఉండిపోయారేమో? కేసీఆర్ తనను కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీలో కొర్చోబెడతానని చెప్పడంతో ఆశగా ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేసిన కుమారస్వామికి ఎన్నికల సమయంలో హ్యాండ్ ఇవ్వడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ కూడా తనలాగే దేశం కోసం చాలా పరితపిస్తున్నారని, అతను నా ఆప్తమిత్రుడని కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఆ తర్వాత ఆయనను పక్కనపెట్టేశారు. అలాగే నటుడు ప్రకాష్ రాజ్‌ని కూడా కొన్ని రోజులు వెంట తిప్పుకొన్నారు. తర్వాత ఏమయిందో ఆయనని వదిలేశారు.
దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తెచ్చేందుకు దేశంలో ప్రతిపక్షాలన్నిటినీ ఒక్క తాటిపైకి తెస్తానని చెప్పి ప్రత్యేక విమానం వేసుకొని అనేక రాష్ట్రాలలో తిరిగారు. కానీ వారందరినీ వదిలేసి ఒంటరిగా మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకొనే పనిలో పడ్డారు.
మునుగోడు ఉపఎన్నికలలో కమ్యూనిస్టుల సహాయసహకారాలు లేనిదే గెలవడం కష్టమని గ్రహించి వారిని ఒప్పించి పొత్తులు పెట్టుకొన్నారు. కానీ ఇప్పుడు వారి అవసరం లేదనిపించగానే తీసి పక్కన పడేశారు. ఇందుకు కమ్యూనిస్టులు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యేందుకు తెరవెనుక నుంచి కేసీఆర్ సహాయం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ స్నేహం చంద్రబాబు నాయుడుని, టిడిపిని రాజకీయంగా దెబ్బతీయడం కోసమే తప్ప, రెండు రాష్ట్రాల మద్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి పనికిరాదని తేల్చేశారు.
ఇలా చెప్పుకొంటూపోతే కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో చాలామంది మెట్లుగా మిగిలిపోయి కనబడతారు. కానీ కేసీఆర్ మాత్రం తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటారు కొత్త మెట్లు వేసుకొంటూ!
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…