
తెలంగాణలో సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొన్న శుక్రవారం ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. వందలాది మంది సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి తమ సమస్యలు చెప్పుకొని వినతి పత్రాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రజలని కలిసి వారి సమస్యలను పరిష్కారిస్తుండటం చూస్తే టక్కున అందరికీ ‘ఒకే ఒక్కడు’ సినిమా గుర్తొస్తుంది.
ఇదివరకు సిఎం కేసీఆర్ తీవ్ర అహంభావంతో నియంతృత్వ పోకడలు పోయేవారు కనుక రేవంత్ రెడ్డి తాను అందుకు పూర్తి భిన్నమైనవాడినని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలని పరిష్కరిస్తానని చాటి చెప్పుకొనేందుకు ఈవిదంగా చేస్తూ ఉండవచ్చు. లేదా తాను చాలా మంచి ముఖ్యమంత్రినని నిరూపించుకొని రాష్ట్ర ప్రజలను మెప్పించేందుకు కావచ్చు.
లేదా కేసీఆర్ హయాంలో సామాన్య ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను స్వయంగా చూశారు కనుక ఇప్పుడు వారి కష్టాలని తీర్చాలని కావచ్చు. కారణం ఏదైనప్పటికీ ప్రజాదర్బార్‌కు తొలిరోజే విశేష స్పందన వచ్చింది. దాంతో సిఎం రేవంత్ రెడ్డి పేరు మారుమ్రోగిపోయింది కూడా.
అయితే కొన్ని రోజుల క్రితమే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని చెప్పుకోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఓ సభలో ఆయన మాట్లాడుతూ, “కొంతకాలం క్రితం మేము కూడా కేసీఆర్‌ని కలిసి ప్రజాదర్బార్ నిర్వహిస్తే బాగుంటుందని అడిగాము. దానికి ఆయన ఏం సమాధానం చెప్పారంటే, “ఓ వైపు ప్రభుత్వంలో పై నుంచి గ్రామస్థాయి వరకు లక్షలాది మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరోవైపు మంత్రులు మొదలు గ్రామస్థాయిలో సర్పంచ్ వరకు వేలాదిమంది పనిచేస్తున్నారు.
ఇంతమంది ప్రజలకు సేవ చేయడానికి ఉన్నప్పుడు కూడా ఇంకా ప్రజలు ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారంటే ఈ రెండు వ్యవస్థలు విఫలమైన్నట్లే కదా?వాటిని సక్రమంగా, సమర్ధంగా పనిచేయించడమే ముఖ్యమంత్రి బాధ్యత.
ఆ రెండు వ్యవస్థలు కూడా పరిష్కరించలేని అసాధారణమైన సమస్య ఏదైనా ఉన్నట్లయితే దానిని ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పరిష్కరించాలి. కానీ రోజూ ప్రజాదర్బార్ నిర్వహించి డ్రామా ఆడాల్సిన అవసరం లేదు,” అని కేసీఆర్ అన్నారని కేటీఆర్ చెప్పారు.
కేసీఆర్ చెప్పింది నూటికి నూరు శాతం నిజమేనని అంగీకరించక తప్పదు. కానీ సిఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించగానే వందలాది మంది ప్రజాభవన్ ముందు క్యూకట్టారంటే అర్దం ఏమిటి? కేసీఆర్ ప్రభుత్వంలో వారి సమస్యలు తీరలేదనే కదా అర్దం?
ముఖ్యమంత్రి నేరుగా ప్రజలను కలవడం చాలా మంచిదే కానీ కేసీఆర్ చెప్పిన్నట్లు ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు సమర్ధంగా పనిచేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సిఎం రేవంత్ రెడ్డి గట్టిగా కృషి చేయడం చాలా అవసరమే. సిఎం ప్రజాదర్బార్ నిర్వహించినా సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు రానిరోజున ఆ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తోందని భావించవచ్చు.
Ask people who directed a hit film most of the people have an answer. Ask…
For decades, Jantar Mantar in Delhi has been an important location for public protests and…